హార్మూజ్‌‌‌‌ ఎందుకంత కీలకం.. అక్కడేం జరుగుతోంది ? హార్మూజ్ జలసంధిని మూసేస్తే ఏమౌతుంది..?

హార్మూజ్‌‌‌‌ ఎందుకంత కీలకం.. అక్కడేం జరుగుతోంది ? హార్మూజ్ జలసంధిని మూసేస్తే ఏమౌతుంది..?

అమెరికా, ఇజ్రాయెల్‌‌‌‌ యుద్ధ ప్రభావం అన్ని దేశాల మీద పడుతోంది. కారణం..  హార్మూజ్‌‌‌‌ జలసంధి. తాత్కాలికంగా దీని ద్వారా రాకపోకలు నిలిచిపోవడంతో చాలావరకు క్రూడాయిల్, ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ సరఫరా ఆగిపోయింది. దాంతో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అక్కడ మరింత అలజడి సృష్టిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అవుతుందనే భయం అన్ని దేశాలకు పట్టుకుంది. హార్మూజ్‌‌‌‌ ఎందుకంత కీలకం. అక్కడేం జరుగుతోంది?  

దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు ఎక్కువగా సముద్ర రవాణా మీదే ఆధారపడ్డాయి. అందుకే సముద్రంలో చిన్న అలజడి ఏర్పడినా ఆ ఎఫెక్ట్‌‌‌‌ ప్రపంచ దేశాల మీద పడుతుంది. ముఖ్యంగా చోక్ పాయింట్స్ అంటే సముద్ర మార్గాల్లోని జలసంధులు, కాలువల గుండా రవాణా ఆగిపోతే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం పడుతుంది. అలాంటిదే హార్మూజ్ జలసంధి. 

ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఇరుకైన సముద్ర మార్గం. ప్రధానమైన ఆయిల్‌‌‌‌ షిప్పింగ్ మార్గాల్లో ఒకటి. ఇది 50 కి.మీ (31 మైళ్లు) వెడల్పు మాత్రమే ఉండే  ‘బాటిల్‌‌‌‌నెక్’ లాంటి వంపుతిరిగిన జలమార్గం. ఈ కారిడార్‌‌‌‌‌‌‌‌కు ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లు సరిహద్దులుగా ఉన్నాయి. అంటే ఇది పర్షియన్ గల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌ను అరేబియన్ సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఒమన్‌‌‌‌తో అనుసంధానం చేస్తుంది.

ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ, ఇరాన్ నుంచి క్రూడాయిల్‌‌‌‌, లిక్విడ్‌‌‌‌ నేచురల్‌‌‌‌ గ్యాస్‌‌‌‌ (ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ)ని తీసుకెళ్తాయి. అందులో ఎక్కువ భాగం ఆసియా దేశాలకే ఎగుమతి అవుతోంది. దీని ద్వారా వెళ్లే షిప్పింగ్ రూట్లకు ప్రత్యామ్నాయాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే మొత్తం క్రూడాయిల్‌‌‌‌, నేచురల్‌‌‌‌ గ్యాస్‌‌‌‌లో దాదాపు 20శాతం దీని గుండానే రవాణా అవుతోంది. 

సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యూఏఈలు 90 శాతానికిపైగా క్రూడాయిల్‌‌ ఎగుమతులు దీనిద్వారానే సాగిస్తున్నాయి. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఈఐఏ) అంచనాల ప్రకారం.. 2025లో రోజుకు దాదాపు 20.9 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌‌ హార్మూజ్ జలసంధి గుండా రవాణా అయ్యింది. అంటే సంవత్సరానికి దాదాపు 600 బిలియన్ల అమెరికన్ డాలర్ల బిజినెస్‌‌‌‌ దీనిద్వారా జరుగుతోంది. అందుకే ఇరాన్‌‌‌‌ ఇప్పుడు దీన్ని ఒక ఆయుధంగా భావిస్తోంది. 

మన దేశంపై ప్రభావం
ప్రపంచంలో మూడో పెద్ద క్రూడాయిల్ వినియోగదారు మన దేశమే. మనకు అవసరమయ్యే క్రూడాయిల్‌‌‌‌లో ఈ మార్గం ద్వారా సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, కువైట్ నుంచి 45–50 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. 40–50 శాతం నేచురల్‌‌‌‌ గ్యాస్‌‌‌‌ ఖతార్ నుంచి దిగుమతి అవుతోంది. ఇది మన రిఫైనరీలు, పవర్ ప్లాంట్‌‌‌‌లకు చాలా కీలకం.

ఇక ఎగుమతుల విషయానికి వస్తే.. భారత్ నుంచి బాస్మతి బియ్యం, టెక్స్‌‌‌‌టైల్స్, ఫార్మాతోపాటు ఇతర ప్రొడక్ట్స్ ఈ రూట్ గుండా ఎగుమతి అవుతున్నాయి. వాటి విలువ 47.6 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా.

2 వేల ఏండ్ల నాటి చరిత్ర 
హార్మూజ్ జలసంధి ఇప్పుడే కాదు.. సుమారు 2 వేల  ఏండ్ల నుంచి వాణిజ్యానికి కేంద్ర బిందువుగా ఉంది. ప్రాచీన కాలంలో ఈ మార్గం చైనా నుంచి యూరప్‌‌‌‌కు సిరామిక్స్, ఐవరీ, సిల్క్, టెక్స్‌‌‌‌టైల్స్ లాంటి వస్తువుల సరఫరాకు ఉపయోగపడింది. 

►ALSO READ | ఇరాన్‌ను ఊహించని దెబ్బ కొట్టిన ఇజ్రాయెల్.. ఫస్ట్ టైం ఇరాన్ చమురు డిపోలపై అటాక్ !

16వ శతాబ్దంలో పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ సామ్రాజ్యాలు దీన్ని కంట్రోల్ చేసి స్పైస్ ట్రేడ్‌‌‌‌పై ఆధిపత్యం చెలాయించాయి. 20వ శతాబ్దంలో గల్ఫ్​లో క్రూడాయిల్‌‌‌‌ నిల్వలు కనుగొన్న తర్వాత ఇది ‘బ్లాక్ గోల్డ్ రూట్‌‌‌‌’గా మారింది. అప్పటినుంచి క్రూడాయిల్‌‌‌‌ను ప్రపంచ మార్కెట్‌‌‌‌లకు అందించడంలో కీలక పాత్ర పోషించింది. 

మూసేస్తే.. 
ప్రస్తుతం హార్మూజ్ జలసంధి ఉత్తర తీరం ఇరాన్ కంట్రోల్‌‌‌‌లో ఉంది. దక్షిణ తీరం ఒమన్ ఆధీనంలో ఉంది. ప్రతి నెలా దాదాపు 3 వేల నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణిస్తున్నాయి. కాబట్టి దీన్ని మూసేస్తే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద చాలా ఎఫెక్ట్‌‌‌‌ పడుతుంది. ఆయిల్‌‌‌‌ కొనే దేశాలే కాదు.. ఎగుమతులపైనే ఆధారపడిన దేశాలు కూడా తీవ్రంగా నష్టపోతాయి. కొన్ని లెక్కల ప్రకారం.. ఇరాన్ రోజుకు దాదాపు 1.7 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌‌ను ఎగుమతి చేస్తోంది.

ఎన్నో దేశాలకు ఇదే ఆధారం 
హార్మూజ్​ను మూసేస్తే ప్రపంచ ఆయిల్ ధరలు 150 డాలర్లకు చేరి, గ్లోబల్ జీడీపీ 2 శాతం పడిపోయే ప్రమాదం ఉందని ఎక్స్​పర్ట్స్‌‌ అంటున్నారు. ముఖ్యంగా ఆసియా దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. ఎందుకంటే ఆసియా దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌‌‌‌లో 69 శాతం ఈ మార్గం గుండానే వస్తోంది. చైనా మీద కూడా ఎఫెక్ట్‌‌‌‌ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని 40 శాతం క్రూడ్ ఇంపోర్ట్స్ హార్మూజ్ గుండానే వెళ్తాయి. 

హార్మూజ్‌‌‌‌ మూతపడితే ఫలితంగా ఫ్యాక్టరీలు పనిచేయక ఎకానమీ దెబ్బతింటుంది. జపాన్ ఎనర్జీ ఇంపోర్ట్స్ 90 శాతం వరకు ఈ రూట్ మీదే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సెక్టార్లు దెబ్బతింటాయి. సౌత్ కొరియాకు ఆయిల్ ఇంపోర్ట్స్ ఆగిపోవడంతో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు నిలిచిపోతాయి. యూరప్‌‌‌‌లో రిఫైనరీలు, ట్రాన్స్‌‌‌‌పోర్ట్ ధరలు పెరిగి, ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. 

30 శాతం గ్లోబల్ ట్రేడ్
* ప్రపంచంలో మొత్తంగా 7 చోక్ పాయింట్స్ ఉన్నాయి. వాటి ద్వారానే దాదాపు 30 శాతం గ్లోబల్ ట్రేడ్ జరుగుతోంది.  
* మలక్కా జలసంధి:  ఇండోనేషియా - మలేషియా మధ్య ఉంది. రోజుకు 80 వేల షిప్స్ ప్రయాణిస్తాయి. ఇది చైనా - యూరప్ ట్రేడ్‌‌‌‌కు చాలా కీలకం. 
* సుయెజ్ కెనాల్: ఈజిప్ట్‌‌‌‌లో ఉంది. ఆఫ్రికా - యూరప్ మధ్య షార్ట్‌‌‌‌కట్‌‌‌‌గా పనిచేస్తుంది. 12 శాతం గ్లోబల్ ట్రేడ్ దీని ద్వారా జరుగుతుంది. 
* బాబ్ ఎల్ - మండెబ్ జలసంధి: యెమెన్ - జిబూతీ మధ్య రెడ్ సీను అరేబియన్ సముద్రంతో అనుసంధానం చేస్తుంది. ఆయిల్ ఎగుమతులకు కీలకం. 
* పనామా కెనాల్: అట్లాంటిక్ - పసిఫిక్ ఓషన్‌‌‌‌లను కనెక్ట్ చేస్తుంది. 5 శాతం గ్లోబల్ ట్రేడ్‌‌‌‌ జరుగుతోంది. 
* బోస్ఫరస్ జలసంధి: టర్కీలో బ్లాక్ సీను మెడిటెరేనియన్‌‌‌‌తో అనుసంధానం చేస్తుంది. ఇది రష్యా ఎగుమతులకు కీలకమైనది.