మధ్యాహ్నం 3 గంటల్లోగా.. ఆఫీస్ల నుంచి ఇళ్లకు వెళ్లిపోండి.. ఉద్యోగులకు హైదరాబాద్ పోలీసుల సూచన

మధ్యాహ్నం 3 గంటల్లోగా.. ఆఫీస్ల నుంచి ఇళ్లకు వెళ్లిపోండి.. ఉద్యోగులకు హైదరాబాద్ పోలీసుల సూచన

హైదరాబాద్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇవ్వాళ (12/08/2025) భారీ వర్ష సూచన ఉందని, ఈ నేపధ్యంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని తెలంగాణ పోలీసులు అధికారిక ‘ఎక్స్’ వేదికగా నగరవాసులకు సూచించారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా చూసుకోండని, సాయంత్రం షిఫ్ట్ ఉన్నవారు ఇంటి నుంచే పని చేసేలా ప్లాన్ చేసుకోగలరని పోలీసులు సూచించడం గమనార్హం.

సిటీలో కొన్నిరోజులుగా పగలంతా ఎండ, రాత్రి వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచిపోతోంది. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం కూడా ఇలాగే మోస్తరు వర్షం పడింది. మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతుంది.

హిమాయత్‌సాగర్‌ పూర్తిగా నిండిపోవడంతో జలమండలి అధికారులు 3 గేట్లను తెరిచి నీటిని దిగువకు పంపిస్తున్నారు. హిమాయత్‌సాగర్‌ పూర్తి నీటి మట్టం 1763.50 అడుగులు ఉండగా ప్రస్తుతం 1761.75 అడుగులుగా నమోదై ఉంది. ఇన్‌ ఫ్లో 1000 క్యూసెక్కులు కాగా అవుట్‌ ఫ్లో 4800 క్కూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం 3 గేట్లను మూడు ఫీట్ల చొప్పున ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ  సర్వీస్ రోడ్డుపై నుంచి వాటర్ వెళ్లడంతో రాజేంద్రనగర్ పోలీసులు రాకపోకలు నిలిపివేశారు.