చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామ సమీపంలో విషాద ఘటన జరిగింది. పూలపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ (35) అనే వ్యక్తి తన భార్య రాణి (30), తన కూతురితో (4) కలిసి బైక్పై తంగడపల్లి గ్రామం మీదుగా పూలపల్లి గ్రామానికి వెళుతున్న క్రమంలో వీరి బైక్ ముందు ఎడ్ల బండి వెళ్తున్నది.
ఎడ్ల బండిని తప్పించుకుని ముందుకు వెళ్లే క్రమంలో.. వెనుక నుంచి ఎడ్ల బండికి వీరు ప్రయాణిస్తున్న బైక్ ఢీ కొట్టింది. బైక్ అదుపు తప్పి ముగ్గురూ కిందపడి పోయారు. భాస్కర్ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందగా తన భార్యకు కూడా తల పగిలి తీవ్ర రక్త స్రావం అయి కోమాలోకి వెళ్ళింది.
స్థానికులు వెంటనే రాణిని, నాలుగేళ్ల పాపను అంబులెన్స్లో శంకర్ పల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఒక్క యాక్సిడెంట్ ఒక కుటుంబాన్ని ఇలా ఛిన్నాభిన్నం చేసింది.
ఓవర్ టేక్ చేసే క్రమంలో.. మరీ ముఖ్యంగా కుటుంబంతో కలిసి బైక్పై వెళుతున్న క్రమంలో జాగ్రత్తలు పాటించి నిదానంగా వెళ్లకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ విషాద ఘటనతో పూలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
