లోక్ అదాలత్‌‌లతో సత్వర న్యాయం.. రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలి

లోక్ అదాలత్‌‌లతో సత్వర న్యాయం..  రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలి
  • మేడ్చల్-మల్కాజిగిరి డీఎల్ఎస్ఏ చైర్మన్​ బాల భాస్కర్​రావు

 మేడ్చల్, వెలుగు: ప్రజలకు తక్కువ ఖర్చుతో సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్‌‌ల ప్రధాన లక్ష్యమని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(డీఎల్ఎస్ఏ) చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్​రావు తెలిపారు. శనివారం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

పెండింగ్‌‌లో ఉన్న సివిల్, మోటార్ ప్రమాద పరిహారం, చెక్​బౌన్స్, కుటుంబ, కార్మిక వివాదాలు వంటి రాజీ పడదగ్గ కేసులను కక్షిదారులు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్‌‌లో ఇచ్చే రాజీ తీర్పునకు కోర్టు డిక్రీతో సమానమైన చట్టబద్ధత ఉంటుందని పేర్కొన్నారు. దీనివల్ల న్యాయస్థానాలపై కేసుల భారం తగ్గడమే కాకుండా, కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వివాదాలను సామరస్యపూర్వకంగా ముగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొనగా.. పలు కేసులను రాజీ మార్గంలో పరిష్కరించారు.

2,098 కేసులు పరిష్కారం 

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌లోని నాంపల్లి, సికింద్రాబాద్, మనోరంజన్ కోర్టు కాంప్లెక్సుల్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌‌లో 2,098 కేసులు పరిష్కారం కాగా.. బాధితులకు రూ.32.15 కోట్ల వరకు పరిహారం చెల్లించినట్లు సెషన్స్ జడ్జి కె.సాయి రమాదేవి తెలిపారు. కక్షిదారులకు సమయం, ఖర్చులు ఆదా చేసేందుకు లోక్ అదాలత్ చక్కటి వేదికన్నారు.

 ముఖ్యంగా సెక్షన్ 138 కింద నమోదైన చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీ చేయదగిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించినట్లు అడిషనల్ సెషన్స్ జడ్జి జి.వేణు పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.అరుణ కుమారి, ఒకటో అదనపు చీఫ్ జడ్జి చంద్ర కిశోర్, బార్ అసోసియేషన్​ప్రెసిడెంట్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.