టాలీవుడ్ అందాల చందమామ అనుష్క శెట్టి. ఒకానొక సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమను తన అభినయంతో, గ్లామర్‌తో ఏకఛత్రాధిపత్యంగా ఏలింది ఈ మంగళూరు ముద్దుగుమ్మ. ప్రస్తుతం స్పీడ్ తగ్గించింది. 'ఘాటీ' తర్వాత ఈ స్వీటీ మళ్లీ తెలుగు తెరపై బిజీ అవుతుందనుకుంటే ఆ సినిమా వైఫల్యంతో సైలెంట్ అయిపోయింది. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటూ అభిమానులను ఊరిస్తోంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' వంటి విభిన్నమైన సినిమాతో పలకరించినప్పటికీ.. కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న స్వీటీ.. ఇప్పుడు తన రూట్ మార్చింది.
'కథనార్'తో విశ్వరూపం!
తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న అనుష్క, ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమ (Mollywood) లోకి భారీ ఎంట్రీ ఇస్తోంది. 'కథనార్: ది వైల్డ్ సోర్సరర్' (Kathanar: The Wild Sorcerer) అనే ఫాంటసీ థ్రిల్లర్‌లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మోహన్ లాల్, ప్రభుదేవా వంటి హేమాహేమీలు ఈ చిత్రంలో భాగస్వాములయ్యారు. 'ఘాటీ' మూవీ షూటింగ్ సమయంలోనే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో తన పాత్ర కోసం అనుష్క ప్రత్యేకంగా కత్తి యుద్ధం, ఇతర యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.. పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం అనుష్క కెరీర్‌కు మళ్ళీ పూర్వ వైభవం తెస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
రిలీజ్ కాకముందే మరో జాక్‌పాట్!
'కథనార్' ఇంకా థియేటర్లలోకి రాకముందే, అనుష్క మాలీవుడ్ నుండి మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. 'మంజుమ్మల్ బాయ్స్' వంటి సంచలన విజయాన్ని అందించిన దర్శకుడు షైజు ఖలీద్, తన తదుపరి ప్రాజెక్ట్ కోసం అనుష్కను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమా పూర్తిగా అనుష్క పాత్ర చుట్టూ తిరిగే వుమెన్ సెంట్రిక్-యూత్ ఫుల్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. వరుసగా రెండు మలయాళ చిత్రాలు దక్కించుకోవడం ఆమె క్రేజ్‌కు నిదర్శనం.
యోగా టీచర్ నుండి గ్లోబల్ స్టార్ వరకు..
మంగళూరులో పుట్టిన అనుష్క, సినిమా రంగంలోకి రాకముందు ప్రొఫెషనల్ యోగా ఇన్స్ట్రక్టర్. పూరీ జగన్నాథ్ 'సూపర్' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆమె, 'అరుంధతి'తో లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. 'బాహుబలి'లో దేవసేనగా ఆమె నటన ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. భాగమతి, రుద్రమదేవి వంటి చారిత్రాత్మక పాత్రలతో మెప్పించింది. ప్రస్తుతం అనుష్క తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కేవలం క్వాంటిటీ కాకుండా క్వాలిటీ కే ప్రాధాన్యత ఇస్తోంది. త్వరలోనే ఆమె మలయాళ చిత్రాలతో మళ్ళీ తన మ్యాజిక్ రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
