హైదరాబాద్: సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ హద్దులపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ హద్దులు మారలేదని.. 2014 మేలో ఇరిగేషన్ శాఖ ప్రాథమికంగా నిర్ధారించిన ఎఫ్‌టీఎల్ మేరకే అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరణ ఇచ్చింది.
ఎఫ్‌టీఎల్ హద్దులు మార్చి అభివృద్ధి చేస్తున్నారన్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణలను హైడ్రా ఖండించింది. కబ్జాల వల్ల 14 ఎకరాలకు తగ్గిన చెరువును 2014 రికార్డుల ప్రకారం 31 ఎకరాలకు విస్తరించినట్లు వెల్లడించింది. ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో పారదర్శకంగా ఎఫ్‌టీఎల్ నిర్ధారణ చేసినట్లు స్పష్టం చేసింది.
ఎమ్మెల్యే సమక్షంలోనే ఇరిగేషన్ అధికారులు వివరాలు వెల్లడించినట్లు హైడ్రా గుర్తు చేసింది. హైడ్రాతో పెద్దలకు మేలు.. పేదలకు నష్టం అనే ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ హద్దులు శాశ్వతమని, వాటిపై అపోహలు వద్దని పేర్కొంది.
