World Cup Records: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా వాంఖడే స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన సూపర్-8 తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు అద్భుతంగా చెలరేగిపోయారు. ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు పడిపోయినా, స్టార్ బ్యాటర్ షిమ్రోన్ హెట్మయర్ మాత్రం ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అతడు కేవలం 34 బంతుల్లోనే 85 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో హెట్మయర్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో విండీస్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా తన సొంత రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. కేవలం 19 బంతుల్లోనే ఈ ఫిఫ్టీని కంప్లీట్ చేసుకోవడం విశేషం.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోవ్‌మన్ పావెల్ కూడా హెట్మయర్‌కు మంచి సహకారం అందించాడు. ఆరంభంలో కొంచెం నెమ్మదిగా ఆడిన పావెల్, ఒకసారి సెటిల్ అయిన తర్వాత జింబాబ్వే బౌలర్లపై దండయాత్ర చేశాడు. కేవలం 35 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ కలిసి 85 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా చివరి ఓవర్లలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్ ఫినిష్ టచ్ ఇచ్చారు. రూథర్‌ఫోర్డ్ ( 31*), షెపర్డ్ ( 21) దూకుడుతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి భారీగా 254 పరుగులు చేసింది.
ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌గా నిలిచింది. 2007 ఎడిషన్‌లో కెన్యాపై శ్రీలంక చేసిన 260/6 ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. ఈ భారీ స్కోర్‌తో వెస్టిండీస్, గ్రూప్‌లోని భారత్, దక్షిణాఫ్రికా జట్లకు గట్టి హెచ్చరిక ఇచ్చినట్టయింది. వారు కేవలం పోటీపడటానికే కాదు, టైటిల్ కోసం కూడా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని పంపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తే, నెట్ రన్‌రేట్ పరంగా భారత్‌పై ఒత్తిడి మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
టీ20 వరల్డ్ కప్ అత్యధిక పరుగులు చేసిన జట్లు ఇవే!
* 2007లో కెన్యాపై శ్రీలంక 260/6..
* 2026లో జింబాబ్వేపై వెస్టిండీస్ 254/6..
* 2026లో ఒమన్ పై ఐర్లాండ్ 235/5..
* 2016లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ 230/8..
* 2016లో ఇంగ్లాండ్ పై సౌత్ ఆఫ్రికా 229/4..
