T20 World Cup: అహ్మదాబాద్‌ అచ్చిరాట్లే: మోడీ స్టేడియంలో మ్యాచులు అస్సలొద్దంటున్న ఫ్యాన్స్..!

T20 World Cup: అహ్మదాబాద్‌ అచ్చిరాట్లే: మోడీ స్టేడియంలో మ్యాచులు అస్సలొద్దంటున్న ఫ్యాన్స్..!

గాంధీనగర్: ప్రపంచంలోనే అత్యధిక సీటింగ్ కెపాసిటీ గల క్రికెట్ గ్రౌండ్ నరేంద్ర మోడీ స్టేడియం. గుజరాత్‌‎లోని అహ్మదాబాద్‌ మోటేరాలో 1 లక్షా 32 వేల సీట్ల సామర్థ్యంతో ఈ మైదానాన్ని నిర్మించారు. అయితే.. ఇండియాలోనే ఉన్న ఈ వరల్డ్ లార్జెస్ట్ క్రికెట్ గ్రౌండ్ టీమిండియాకు ఏ మాత్రం అచ్చి రావడం. ఇందుకు ప్రధాన కారణం ఈ గ్రౌండ్‎లో ఇండియా ఆడిన రెండు ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచులు ఓడిపోవడమే. 

ఐసీసీ ఈవెంట్లలో భాగంగా గత 29 మ్యాచ్‌ల్లో భారత్ కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఓటమి పాలైన ఈ రెండు మ్యాచులు కూడా నరేంద్ర మోడీ స్టేడియంలోనే కావడం గమనార్హం. 2023, వన్డే వరల్డ్ కప్‎లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఓటమి ఎరగకుండా మెగా టోర్నీ ఫైనల్‎కు చేరుకుంది. 

కానీ నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచులో మాత్రం టీమిండియా ఓటమి పాలై కప్‎కు అడుగు దూరంలోనే నిలిచిపోయింది. ఇదిలా ఉండగా.. 2026 టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రౌండ్‎లో భాగంగా ఇదే నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచులో సౌతాఫ్రికాతో చేతిలో టీమిండియా 75 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. 

ఇది చాలదన్నట్లుగా ఈ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరగనుండటం అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ స్టేడియం టీమిండియాకు అస్సలు అచ్చిరావట్లేదని.. ఇక్కడ ఇండియాకు కీలకమైన మ్యాచులు పెట్టొద్దని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  

1 లక్షా 32 వేల సీట్ల  సామర్ధ్యం ఉన్న ఈ స్టేడియంలో మ్యాచ్  నిర్వహిస్తే భారీగా జనం స్టేడియానికి వస్తారనేది బీసీసీఐ, ఐసీసీ వ్యూహం. కానీ మోడీ స్టేడియంలో వెంటాడుతోన్న బ్యాడ్ సెంటిమెంట్ కారణంగా అహ్మదాబాద్‌లో మ్యాచులు అస్సలు వద్దని అంటున్నారు టీమిండియా అభిమానులు.