డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు పెంచాలి: డీజేఎఫ్‎టీ

డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు పెంచాలి:  డీజేఎఫ్‎టీ

హైదరాబాద్: డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని డీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జ్యోతిబాసు, మస్తాన్ ఆందోళన వ్యక్తం చేశారు. డెస్క్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ల సంఖ్య భారీగా తగ్గించడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని తెలిపారు. గతంలో ప్రతి జిల్లా (33 జిల్లాలకు) ఐదుగురికి, ఎడిషన్ జర్నలిస్టులకు అడ్రెడిటేషన్ కార్డులు వచ్చాయని తెలిపారు. 

ఇప్పుడు, కేవలం ఎడిషన్ సెంటర్‎కు నాలుగు అక్రిడిటేషన్లు మాత్రమే ఇస్తామని నిబంధన పెట్టడం దారుణమన్నారు. ఈ నిబంధన వల్ల చాలామంది డెస్క్ జర్నలిస్టులు అక్రెడిటేషన్లకు దూరం అవుతున్నారని తెలిపారు. డెస్క్ జర్నలిస్టులు ఎడిషన్ కేంద్రాల్లోనే పనిచేసినా ఏ జిల్లాకు ఆ జిల్లా డెస్కులు వేరువేరుగా ఉంటాయని, ప్రతి జిల్లాకు ఒక ఇన్చార్జితో పాటు సలుగురు సబ్ ఎడిటర్లు ఉంటారని చెప్పారు. 

ఒక్కో ఎడిషన్లో మూడు నుంచి ఆరు జిల్లాలున్నాయని వాటికి అనుగుణంగా అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో ప్రకారం ఎడిషన్కు నాలుగు కార్డులే ఇస్తే కనీసం ఆ జిల్లాల ఇన్చార్జిలకు కూడా అక్రెడిటేషన్లు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. హైదరాబాద్ సిటీకి కూడా ఆరు కార్డులే ఇస్తున్నారని, ఇక్కడ కనీసం 17 నుంచి 18 మంది పనిచేస్తున్నారని చెప్పారు. 

పైగా ఇప్పుడు హైదరాబాద్ మూడు కమిషరేట్లుగా మారడంతో పేజీలు కూడా పెరుగుతున్నాయన్నారు. అందువల్ల డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే డెస్క్ జర్నలిస్టులకు గూడా అక్రిడిటేషన్లను 12 నుంచి 8కి తగ్గించారని చెప్పారు. వారికి కూడా 15 కార్డులు ఇవ్వాలని కోరారు.

ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డీజేఎఫ్ టి  ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. ఐ అండ్ పీ ఆర్ కార్యాలయం ఎదుట సోమవారం నిర్వహించిన ధర్నా లో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ.. అక్రెడిటేషన్ల మంజూరు విషయంలో వివక్ష తగదన్నారు. 

డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల అక్రెడిటేషన్ల విషయంలో బయట వ్యక్తుల ప్రమేయంతోనే గందరగోళ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. టీయూడబ్ల్యూజే 143 ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, కోశాధికారి యోగి మాట్లాడుతూ, గతంలో మాదిరిగానే జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. 

కార్డుల కోసం జర్నలిస్టులు రోడ్ల పైకి వచ్చే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రెడిటేషన్ల విషయంలో అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలనీ, లేకుంటే జర్నలిస్టు సంఘాలను కలుపుకొని సచివాలయ ముట్టడితో పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు వెనకాడమని స్పష్టం చేశారు. 

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి గండ్ర నవీన్ మాట్లాడుతూ, డి జె ఎఫ్ టీ కి మొదట నుంచి హెచ్ యు జె - టి డబ్ల్యు జె ఎఫ్ అండగా ఉన్నదని చెప్పారు. డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం డి జె ఎఫ్ టి చేసే భవిష్యత్తు పోరాటాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అనర్హులను ఏరివేయండి, సహకరిస్తాం.. కానీ, అర్హత కలిగిన ఒక్క జర్నలిస్టుకైనా అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. హెచ్‎యూజే అధ్యాక్షులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. డీజేఎఫ్టీ నేత విజయ మాట్లాడుతూ.. డెస్క్ జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.