Jos Buttler: జాన్ బట్లర్ మరణం.. తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయిన కొడుకు

Jos Buttler: జాన్ బట్లర్ మరణం.. తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయిన కొడుకు

ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. బట్లర్ తండ్రి వారం క్రితం మరణించారు. ఈ విషాదకర సంఘటన తర్వాత కన్నీళ్లను అణుచుకోని వారం తర్వాత హండ్రడ్ లీగ్ లో తన తొలి మ్యాచ్ లో ఆడిన బట్లర్ డకౌటయ్యాడు. ఆగస్టు 9 (శనివారం) ఓవల్ ఇన్విన్సిబుల్స్‌తో జరిగిన మ్యాచ్ లో మాంచెస్టర్ ఒరిజినల్స్ తరపున ఆడుతున్న బట్లర్ నాలుగు బంతులాడి గోల్డెన్ డక్ గా  వెనుదిరిగాడు. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్ లో డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన బట్లర్ కు టైమింగ్ మిస్ కావడంతో డోనోవన్ ఫెర్రీరాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు.

బట్లర్ తండ్రి వారం క్రితం మరణించడంతో మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టు మొత్తం అతనికి నల్లటి ఆర్మ్ బ్యాండ్ ధరించి నివాళులు అర్పించారు. మ్యాచ్ తర్వాత బట్లర్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో " రెస్ట్ ఇన్ పీస్ డాడ్.. థాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్". అని తన తండ్రికి నివాళులు అర్పించాడు. ఈ సీజన్ లో హండ్రెడ్ లీగ్ లో బట్లర్ కు ఇది తొలి మ్యాచ్. అంతకముందు తన తొలి మ్యాచ్ లోనూ బట్లర్ విఫలమయ్యాడు. సదరన్ బ్రేవ్స్‌తో జరిగిన మ్యాచ్ లో 18 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున బట్లర్ అద్భుతంగా రాణించాడు. 163.03 స్ట్రైక్ రేట్‌తో 538 పరుగులు చేశాడు. వీటిలో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాంచెస్టర్ ఒరిజినల్స్ పై ఓవల్ ఇన్విన్సిబుల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ నిర్ణీత 100 బంతుల్లో 128 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ ఫిల్ సాల్ట్ 41 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీసుకొని ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో  ఓవల్ ఇన్విన్సిబుల్స్ 57 బంతుల్లోనే వికెట్ నష్టానికి 129 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు విల్ జాక్స్ (61), టవాండా ముయేయే (59) మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు.