వాషింగ్టన్: ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ ఫోర్స్, నావికాదళాన్ని నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని కూడా తుడిచి పెట్టామని పేర్కొన్నారు. ఇరాన్‌తో నాలుగు రోజులుగా కొనసాగుతోన్న యుద్ధంపై మంగళవారం (మార్చి 3) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు.
‘‘ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ, వైమానిక దళం, నావికాదళాన్ని నాశనం చేశాం. ఆ దేశ అగ్ర నాయకత్వం కూడా ఖతమైంది. ఇరాన్ ఇప్పుడు తమతో చర్చలు జరపాలనుకుంటుంది. కానీ ఇప్పటికే ఆలస్యమైందని చెప్పా’ అని పేర్కొన్నారు. అమెరికా దగ్గర ఎవరూ ఊహించలేని శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సోమవారం (మార్చి 2) వైట్ హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై మేం ఇంకా యుద్ధాన్ని ఉధృతం చేయలేదని.. త్వరలోనే దాడులను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు. అమెరికా బలగాలు ఇరాన్ సైనికులు తరిమికొట్టాయని.. మా జోలికి వచ్చినవారిని వదిలిపెట్టమని తేల్చి చెప్పారు.
►ALSO READ | రష్యా వైపు భారత్ చూపు..క్రూడ్ ఆయిల్ దిగుమతికి యత్నం
ఇక, ఇరాన్ వారసత్వ ప్రణాళిక గురించి తమకు తెలియదని పేర్కొన్నారు. అరబ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం తమకు ఆశ్చర్యం వేసిందని అన్నారు. ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న గల్ఫ్ దేశాలు ఇరాన్‌పై దాడులు చేసేందుకు ముందుకు వస్తున్నాయని.. ఇది తమకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు.
గల్ఫ్ దేశాల్లోని హోటళ్లు, మానవ నివాసాలపై ఇరాన్ దాడులు చేయడం అరబ్ దేశాల్లో కోపాన్ని రేకెత్తించిందని అన్నారు. అరబ్ నాయకత్వంతో తనకు పరిచయం ఉందని.. వారు కఠినమైన, తెలివైన నాయకులని పేర్కొన్నాడు.
ఇరాన్ ప్రజలు ప్రభుత్వ నియంత్రణను పొందడానికి అమెరికా సైనిక చర్యకు మించిన యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకాడదని ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఇరాన్‌పై దాడులు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. దీంతో మరికొన్ని రోజులు బాంబులు, మిస్సైళ్లతో మిడిల్ ఈస్ట్ అట్టుడకనుంది.
