ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇవ్వని ఇజ్రాయెల్: ఇరాన్‎పై బాంబుల వర్షం

ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇవ్వని ఇజ్రాయెల్: ఇరాన్‎పై బాంబుల వర్షం

టెల్ అవీవ్: ఇరాన్‎పై ఇజ్రాయెల్ దాడుల పరంపరను కొనసాగిస్తోంది. ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇవ్వకుండా బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. మంగళవారం (మార్చి 3) కూడా ఇరాన్ అంతటా పేలుళ్లు వినిపిస్తున్నాయి. ఇరాన్ దక్షిణ నగరమైన బుషెహర్‌లోని విమానాశ్రయం, ఎయిర్ బేస్‎పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసిందని ఇరాన్ మీడియా నివేదించింది. 

తూర్పు టెగ్రాన్‌లోని హకీమిహ్ ప్రాంతం కూడా దెబ్బతింది. అలాగే, టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయాన్ని కూడా టార్గెట్ చేసింది. ఇక్కడతో ఆగని ఇజ్రాయెల్.. కోమ్‌లోని ఇరాన్ నిపుణుల మండలి భవనంపైన అటాక్ చేసింది. అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ నెక్ట్స్ సుప్రీం లీడర్‎ను ఎన్నుకునే బాధ్యత ఈ కౌన్సిల్‎కే ఉంది. మంగళవారం (మార్చి 3) ఖమేనీ వారసుడిని ఎన్నుకోవడానికి సభ్యుల ఓట్లు లెక్కిస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 

►ALSO READ | భారత్ కు ఆయిల్ సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నాం: రష్యా

ఆ సమయంలో కౌన్సిల్‌లోని 88 మంది సభ్యులలో ఎంతమంది భవనం లోపల ఉన్నారు..? ఎంత ప్రాణ నష్టం జరిగిందన్న విషయం స్పష్టంగా తెలియలేదు. ఈ దాడిపై ఓ ఇజ్రాయెల్ అధికారి మాట్లాడుతూ.. కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకోకుండా వారిని నిరోధించాలనే ఈ దాడి చేసినట్లు స్పష్టం చేశారు. 

ఇరాన్‏పై దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా తేల్చి చెప్పారు. మరోవైపు ఇరాన్ కూడా ధీటుగానే స్పందిస్తుంది. ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‎తో పాటు అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ కంట్రీస్‎పై అటాక్స్ చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు, ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్ బాంబులు, మిస్సైళ్ల మోతతో దద్దరిల్లుతోంది.