కూలీ, వార్2 టికెట్ రేట్ల పెంపునకు.. పర్మిషన్ లేనట్టేనా..? రీజన్ ఏంటంటే..

కూలీ, వార్2 టికెట్ రేట్ల పెంపునకు.. పర్మిషన్ లేనట్టేనా..? రీజన్ ఏంటంటే..

తెలుగు రాష్ట్రాల్లో కూలీ, వార్2 టికెట్ రేట్ల పెంపు ప్రచారంపై సినీ అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎలాంటి పెంపు లేకుండానే మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్లు తెలిసింది. కూలీ, వార్2 సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు భారీగా పెంచబోతున్నట్లు వచ్చిన వార్తలపై సినీ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. టికెట్ రేట్లు పెంచాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇప్పటికే వినతులు అందాయి.

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు టికెట్ రేట్ల పెంపుపై ఇప్పటివరకైతే ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. ముంబైలో వార్2 సినిమాకు, చెన్నైలో కూలీ సినిమాకు లేని టికెట్ రేట్ల పెంపు తెలుగు రాష్ట్రాల్లో ఏంటని సగటు సినీ ప్రేక్షకులు సోషల్ మీడియాలో నిప్పులు చెరిగారు. కూలీ సినిమా స్ట్రయిట్ తమిళ్ సినిమా. లోకేష్ కనగరాజ్, రజినీకాంత్ కాంబోలో వస్తున్న సినిమా. చెన్నై సిటీలో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే.. ఆల్ మోస్ట్ 100కు 90 శాతం ఓపెనింగ్స్తో థియేటర్లు కళకళలాడుతున్నాయి.

వార్2 స్ట్రయిట్ బాలీవుడ్ ఫిల్మ్. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించాడనే ఒకేఒక్క కారణం తప్ప తెలుగు సినీ ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడి వెళ్లడానికి, క్యూ కట్టడానికి మరో కారణం లేదు. కూలీ సినిమా కూడా అంతే. సినిమాకు బజ్ ఉందని, తెలుగు నటుడు నాగార్జున విలన్ రోల్ చేశాడనే కారణంతో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపునకు అనుమతి కోరడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

►ALSO READ | RaoBahadur: వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్తో.. మహేష్ బాబు మూవీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

‘‘చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎల్మెంట్ సినిమా’’ అని ఒక పక్క చెబుతూనే.. ఇష్టారీతిన టికెట్ రేట్లు పెంచేసి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటం గమనార్హం. వార్2, కూలీ సినిమాలకు ఆ ఇండస్ట్రీలు ఉన్న సొంత రాష్ట్రాల్లోనే టికెట్ రేట్లను పెంచలేదు. అలాంటిది.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా పిచ్చోళ్లున్నారని, టికెట్ రేట్ ఎంత పెంచినా థియేటర్లకు ఎగబడి వస్తారని భావించడం.. తెలుగు సినీ నిర్మాతలకు ప్రేక్షకుల మీద ఉన్న చులకన భావానికి నిదర్శనం అని నెటిజన్లు మండిపడ్డారు. తెలుగు సినీ ప్రేక్షకుల బలహీనతను సొమ్ము చేసుకునే దురాశతో వార్2, కూలీ సినిమా టికెట్ రేట్లను పెంచాలని డిస్ట్రిబ్యూటర్లు కోరడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

డిస్ట్రిబ్యూటర్లు రైట్స్ భారీ రేట్లకు కొన్నారని ఆ భారాన్ని ప్రేక్షకులపై మోపాలని చూడటం అమానుషమని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కూలీ టికెట్ రేట్లను పెంచితే హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్లలో బాల్కనీ టికెట్ రూ.250, ఫస్ట్ క్లాస్ రూ.175, సెకండ్ క్లాస్ టికెట్కు 100 రూపాయలు ఖర్చు పెట్టి చూడాల్సిన పరిస్థితి. ఈ రేట్లపై మళ్లీ ట్యాక్స్లు అదనం. ఇక.. మల్టీప్లెక్స్ అయితే.. 415 రూపాయలు, రిక్లైనర్ అయితే 530 రూపాయలు పెట్టి టికెట్ కొనాల్సిందే. వీటికి కూడా జీఎస్టీ, ఇతర ట్యాక్స్లు అదనం. ఒకపక్క ప్రేక్షక దేవుళ్లంటూనే మరో పక్క ఇలా దోపిడీకి పాల్పడటంపై సినీ అభిమానుల నుంచి ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి.