Suryakumar Yadav: అక్షర్ పటేల్‌‌ను తప్పించడం తప్పే.. క్షమాపణలు కూడా చెప్పా

Suryakumar Yadav: అక్షర్ పటేల్‌‌ను తప్పించడం తప్పే.. క్షమాపణలు కూడా చెప్పా

Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన భారత్.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు సొంతగడ్డపై టైటిల్ గెలిచిన మొదటి టీమ్‌గా చరిత్ర సృష్టించింది. మూడు టీ20 ప్రపంచకప్‌లు అందుకున్న జట్టుగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ టోర్నీలో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్– 8 మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌‌ను తప్పించడం తన తప్పిదమేనని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో అతడు తీవ్రంగా మండిపడ్డాడని, మ్యాచ్ అనంతరం అతనికి వ్యక్తిగతంగా వెళ్లి క్షమాపణలు కూడా చెప్పానని తాజాగా సూర్య పేర్కొన్నారు. 
 
 ఈ టోర్నమెంట్లో మంచి ప్రదర్శన కనబర్చిన భారత్.. సూపర్– 8లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు బదులు వాషింగ్టన్ సుందర్‌ను ఆడించి భారీ ఓటమిని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఎక్కువగా లెఫ్టార్మ్ బ్యాటర్లు ఉండటంతో.. లెగ్ స్పిన్నర్ అయిన అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టారు.. ఈ నిర్ణయం బెడిసి కొట్టడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు. కానీ అక్షర్ పటేల్‌ను తప్పించడం తన పొరపాటేనని సూర్యకుమార్ యాదవ్ తాజాగా అంగీకరించాడు.

నేను తీసుకున్న నిర్ణయంతో అక్షర్ పటేల్ చాలా ఆగ్రహానికి గురయ్యాడు.. అలా అవ్వడం కూడా కరెక్ట్.. అతను ఎంతో అనుభవం కలిగిన ప్లేయర్ అని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీకి కెప్టెన్ గా ఉన్నాడు.. కాబట్టి కోపం రావడం సహజం.. నేను అతనికి క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిపాడు. కానీ అది జట్టు ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని వెల్లడించారు. ఆ సంభాషణ కాస్త కఠినంగానే కొనసాగింది.. కానీ అతను దాన్ని సానుకూలంగానే తీసుకున్నాడు. తర్వాత రోజే మేం దాని గురించి కూర్చుని చర్చించామని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.  

ALSO READ : సచిన్ను జట్టు నుంచి తప్పించాలనుకున్నాం..

టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత గౌతమ్ గంభీర్ ఇచ్చిన స్పీచ్ గురించి కూడా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షేర్ చేసుకున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లలో సాధించిన 100 విజయాలను ప్రజలు మర్చిపోతారని, కానీ ప్రపంచకప్ విజయాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని గంభీర్ మాతో చెప్పాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత గంభీర్ ఎంతో ఆనందంగా కనిపించారని చెప్పుకొచ్చాడు. కాగా మొదటి 4 మ్యాచ్‌ల్లో మేం అతనికి నవ్వే ఛాన్స్ ఇవ్వలేదు.. కానీ, ఆ తర్వాత మా ఆట తీరు చూసి చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే 250, 256 రన్స్ చేయడం, భారీ లక్ష్యాలను ఈజీగా ఛేదించడం, టీమిండియా టీ20 చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఫైనల్ తర్వాతే గంభీర్ అందరికంటే ఎక్కువగా నవ్వాడని సూర్యకుమార్ వెల్లడించారు.