ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల లిస్టులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల లిస్టులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసు తుది దశకు చేరుకుంది. ప్రధాన నిందితుడైన ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌ ప్రభాకర్ రావు విచారణ దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే సప్లిమెంటరీ చార్జిషీట్‌‌‌‌ దాఖలు చేసేందుకు సిట్‌‌‌‌ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ప్రభాకర్ రావు సహా కేసులో నిందితులైన ప్రణీత్‌‌‌‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌‌‌‌ రావు, శ్రవణ్‌‌‌‌రావుపై గతేడాది జూన్‌‌‌‌ 11న సిట్‌‌‌‌ అధికారులు ప్రిలిమినరీ చార్జిషీట్‌‌‌‌ దాఖలు చేశారు. అయితే, నిందితులకు బెయిల్ రావడంతో పాటు ప్రిలిమినరీ చార్జిషీట్‌‌‌‌ దాఖలు చేసి సరిగ్గా 15 నెలలు పూర్తి కావడంతో అనుబంధ చార్జిషీట్‌‌‌‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. 

కీలకంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల లిస్టులు

సిట్‌‌‌‌ దర్యాప్తులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌‌‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌ సహా టెలికం సర్వీసెస్‌‌‌‌ అందించిన 618 మందిలో ఇప్పటికే 220 మంది బాధితుల వాంగ్మూలాలు కీలకంగా మారాయి. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌షా సహా బీజేపీ అగ్రనాయకుల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు టీమ్‌‌‌‌ ట్యాపింగ్ చేసిందా? అనే వివరాలను సిట్‌‌‌‌ సేకరిస్తోంది. ఈ మేరకు మరికొంత మంది ప్రముఖుల స్టేట్‌‌‌‌మెంట్లను రికార్డ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దర్యాప్తులో భాగంగా సేకరించిన నిందితుల కాల్‌‌‌‌ డేటా రికార్డింగ్‌‌‌‌(సీడీఆర్‌‌‌‌‌‌‌‌) వాట్సాప్‌‌‌‌ చాటింగ్స్‌‌‌‌, ఫోరెన్సిక్ సైన్స్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌(ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌) రిపోర్ట్, టెలికాం సర్వీసెస్‌‌‌‌ అందించిన ట్యాపింగ్ లిస్ట్‌‌‌‌, సాక్షుల స్టేట్‌‌‌‌మెంట్లు సహా డిజిటల్‌‌‌‌ ఆధారాలు ఇలా వేల సంఖ్యలో డాక్యుమెంట్లతో కూడిన చార్జిషీట్‌‌‌‌ను రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.  

ప్రిలిమినరీకి అనుబంధంగా రెండు చార్జిషీట్లు!

పంజాగుట్ట పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో గత ఏడాది మార్చి 10న కేసు నమోదైన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌‌‌‌(ఎస్‌‌‌‌ఐబీ), సిటీ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌లో పనిచేసిన పోలీసు అధికారులు, ప్రైవేటు వ్యక్తులు సహా మొత్తం 69 మంది సాక్షుల వాంగ్మూలాలతో కూడిన ప్రిలిమినరీ చార్జిషీట్‌‌‌‌ను సిట్‌‌‌‌ ఇప్పటికే దాఖలు చేసింది. అభియోగాలను బలపరిచే వేలాది డాక్యుమెంట్లను చార్జిషీట్‌‌‌‌లో పొందుపరిచారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంశాలుండడంతో మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. 

ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, ఆరో నిందితుడు శ్రవణ్‌‌‌‌ రావు అప్పట్లో పరారీలో ఉండడంతో వారిని విచారించాక మరిన్ని ఆధారాలతో అనుబంధ చార్జిషీట్‌‌‌‌ దాఖలు చేస్తామని వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 4 నెలలు పాటు దాదాపు12,00 ఫోన్లకు పైగా నిందితులు ట్యాప్‌‌‌‌ చేసినట్టు సిట్‌‌‌‌ తన ప్రిలిమినరీ చార్జిషీట్‌‌‌‌లో పేర్కొన్నారు. బీఆర్ఎస్​ను గెలిపించడం కోసమే ప్రభాకర్‌‌‌‌రావు ఆధ్వర్యంలో అక్రమంగా ట్యాపింగ్‌‌‌‌ చేసినట్టు వెల్లడించింది. రాజకీయ నేతలు, జడ్జీలు, జర్నలిస్టులు సహా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ టార్గెట్స్‌‌‌‌గా ఉన్న వారి ఫోన్లను ట్యాప్‌‌‌‌ చేసినట్టు ఆధారాలతో చార్జిషీట్‌‌‌‌ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే మరో రెండు సప్లిమెంటరీ చార్జిషీట్లను దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.