న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఒడిదుడుకుల్లో కదిలే అవకాశం కనిపిస్తోంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 93 డాలర్లకు చేరడంతో మార్కెట్లు పడొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు, రూపాయి కదలికలు ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయిస్తాయని వివరించారు. గత వారం సెన్సెక్స్ 2,368 పాయింట్లు (2.91 శాతం), నిఫ్టీ 728 పాయింట్లు పడిపోయాయి.
విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) గత నాలుగు రోజుల్లో నికరంగా రూ.21 వేల కోట్ల విలువైన షేర్లను అమ్మారు. మార్కెట్‌లోకి వీరు కొనుగోలుదారులుగా తిరిగి రావడానికి టైమ్ పడుతుందని, యుద్ధానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినంత వరకు కొనుగోళ్లు జరపకపోవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. మార్చి 11న అమెరికా ద్రవ్యోల్బణం డేటా విడుదల కానుండగా, మార్చి 12న ఇండియా ద్రవ్యోల్బణ డేటా వెలువడనుంది. వీటిపై ట్రేడర్లు దృష్టి పెట్టనున్నారు.
