ఢిల్లీలో ఫస్ట్ ‘రింగ్ మెట్రో’..మూడు కారిడార్లకు శంకుస్థాపన

ఢిల్లీలో ఫస్ట్ ‘రింగ్ మెట్రో’..మూడు కారిడార్లకు శంకుస్థాపన

 

  • రెండు కొత్త మెట్రో కారిడార్ల ఓపెనింగ్.. 
  • రాష్ట్రపతికి టీఎంసీ అవమానాన్ని నారీ శక్తి క్షమించదని కామెంట్

న్యూఢిల్లీ/కోల్‌‌‌‌కతా:దేశంలో తొలి ‘రింగ్ మెట్రో’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో రైల్​ కార్పొరేషన్​ఆధ్వర్యంలో నిర్మించిన రెండు కొత్త మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు మరో మూడు కారిడార్లకు శంకుస్థాపన చేశారు.

పింక్ ​లైన్​ పూర్తి

ఢిల్లీలో కొత్తగా నిర్మించిన సుమారు 12.3 కిలోమీటర్ల పొడవు గల మజ్లిస్ పార్క్– మౌజ్‌‌‌‌పూర్– బాబర్‌‌‌‌పూర్ కారిడార్‌‌‌‌ను ఇప్పటికే పనిచేస్తున్న మజ్లిస్ పార్క్–శివ్ విహార్ పింక్ లైన్‌‌‌‌లో కలిపారు. ఇందులో మొత్తం ఎనిమిది ఎలివేటెడ్ స్టేషన్లు ఉన్నాయి. ఇది ప్రారంభం కావడంతో పింక్ లైన్ మొత్తం పొడవు సుమారు 71.56 కిలోమీటర్లకు పెరిగి దేశంలోనే తొలి పూర్తిస్థాయి ‘రింగ్ మెట్రో’గా మారింది.

ఈ మార్గంలో యమునా నదిపై మెట్రో లైన్, వాహనాల కోసం ఫ్లైఓవర్‌‌‌‌ కలిపి ఎత్తైన బ్రిడ్జి నిర్మించారు. ఇక దీపాలి చౌక్ నుంచి మజ్లిస్ పార్క్ వరకు సుమారు 9.9 కిలోమీటర్లు పొడవులో మరో కొత్త లైన్​ నిర్మించారు. ఇది బోటానికల్ గార్డెన్ –కృష్ణ పార్క్ ఎక్స్​టెన్షన్​ లైన్​కు ఎలివేటెడ్ విస్తరణ. ఈ మార్గంలోని కొన్ని చోట్ల లైన్​ సుమారు 28.36 మీటర్ల ఎత్తులో ఉంది.

మూడు కొత్త కారిడార్లకు శంకుస్థాపన

ఫేజ్–5(ఏ) విస్తరణలో భాగంగా మూడు కొత్త మెట్రో కారిడార్లకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇందులో  రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్ నుంచి ఇంద్రప్రస్థ వరకు 9.913 కి.మీ. అండర్‌‌‌‌గ్రౌండ్ లైన్​ను ‘సెంట్రల్ విస్టా కారిడార్’ పేరుతో చేపడుతున్నారు. 2.263 కి.మీ. అండర్‌‌‌‌గ్రౌండ్ లైన్​తో గోల్డెన్ లైన్ విస్తరణ (ఏరోసిటీ-టెర్మినల్ 1), 3.9 కి.మీ. ఎలివేటెడ్ లైన్​ను ‘తుగ్లకాబాద్-– కాలింది కుంజ్’ విస్తరణలో భాగంగా చేపడుతున్నారు. ఈ కొత్త మార్గాల ద్వారా నోయిడా నుంచి సౌత్​ ఢిల్లీ,  ఎయిర్​పోర్టుకు ప్రయాణం మరింత ఈజీగా మారనుంది. 

  • రాష్ట్రపతికి జరిగిన అవమానాన్ని ‘నారీ శక్తి’ క్షమించదు 
  • బెంగాల్ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు 

న్యూఢిల్లీ/కోల్‌‌‌‌కతా: పశ్చిమ బెంగాల్‌‌‌‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా జరిగిన ఏర్పాట్లపై ప్రధాని నరేంద్ర మోదీ  తీవ్రంగా స్పందించారు. రాష్ట్రపతిని అవమానించడం అంటే దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించినట్లేనని అన్నారు. ఈ ఘటనను దేశ ప్రజలు, ముఖ్యంగా ‘నారీ శక్తి’ ఎప్పటికీ క్షమించదని మండిపడ్డారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ, పశ్చిమ బెంగాల్‌‌‌‌లో అధికారంలో ఉన్న  టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల బెంగాల్ పర్యటనలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము  9వ ఇంటర్నేషనల్ సంతాళీ కాన్‌‌‌‌క్లేవ్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మొదట బిధాన్‌‌‌‌నగర్‌‌‌‌లో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని బాగ్‌‌‌‌డోగ్రా సమీపంలోని గోషాయ్‌‌‌‌పూర్‌‌‌‌కు మార్చారు.

దూరంగా కార్యక్రమం చేపట్టడంతో ప్రజలు అక్కడికి చేరుకోలేకపోయారని రాష్ట్రపతి పేర్కొన్నారు. సాధారణంగా రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం, మంత్రులు హాజరవుతారని, కానీ ఈ కార్యక్రమానికి మమత  రాకపోవడం తనను బాధించిందని ముర్ము అన్నారు. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. రాష్ట్రానికి  చెడ్డపేరు తెచ్చేందుకే  కేంద్రంలోని బీజేపీ ఈ వ్యవహారాన్ని రాజకీయం చేశారని ఆరోపించారు.