స్టార్టప్ : కథలు విని.. శిఖరాల బాట పట్టింది..! ప్రపంచానికి తెలియని 16 ప్రదేశాలను మ్యాప్ చేసింది...

స్టార్టప్ :  కథలు విని.. శిఖరాల బాట పట్టింది..! ప్రపంచానికి తెలియని 16 ప్రదేశాలను మ్యాప్ చేసింది...

ఆల్పైన్ మైదానాల్లో హిమాలయ శిఖరాల మధ్య ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. వాటి గురించి అక్కడి గొర్ల కాపరులకు తప్ప ఎవరికీ తెలియదు. వాటిని చేరుకోవడం కూడా అంత ఈజీ కాదు. కానీ.. షబ్నమ్ బషీర్ ధైర్యంగా సోలో ట్రెక్కింగ్‌‌ చేసింది. ప్రపంచానికి తెలియని 16 ప్రదేశాలను మ్యాప్ చేసి, పర్యాటక ప్రాంతాలుగా మార్చింది. టూరిజంతో అక్కడివాళ్లకు ఉపాధిని కల్పించి ఆదాయ మార్గాలను సృష్టించింది.

షబ్నమ్ బషీర్ 1997 జనవరి 25న జమ్మూ కాశ్మీర్‌‌‌‌లోని బండిపొరా జిల్లాలో ఉన్న క్విల్ ముఖాం అనే గ్రామంలో పుట్టింది. ఆ ఊరి చుట్టూ పర్వత శ్రేణులే కనిపిస్తాయి. గుజ్జర్– బకర్వాల్ తెగకు చెందిన షబ్నమ్‌‌కు చిన్నప్పటినుంచే కొత్త ప్రదేశాలను ఎక్స్‌‌ప్లోర్‌‌ చేయాలనే ఆసక్తి ఉండేది. తండ్రి బషీర్ అహ్మద్ ఒక గొర్ల కాపరి. అతను ప్రతిరోజూ రాత్రి షబ్నమ్‌‌కు కథలు చెప్పేవాడు. 

ఆ కథల్లో వాళ్ల ప్రాంతంలో దాగి ఉన్న లోయలు, మంచు పర్వతాల మధ్య ఉన్న రహస్య మార్గాలు, స్థానిక మూలికల ఔషధ గుణాలు.. లాంటి విషయాలు ఎన్నో ఉండేవి. షబ్నమ్‌‌ వాటినుంచి ప్రేరణ పొంది ట్రెక్కింగ్‌‌ మీద ఆసక్తి పెంచుకుంది. హర్ముఖ్ పర్వతంపైకి ఎక్కుతున్న ట్రెక్కర్లను చూస్తూ.. తనూ అలాంటి ప్రయాణాలు చేయాలని కలలు కనేది. 

సోలో ట్రెక్స్

సాధారణంగా గుజ్జర్–బకర్వాల్ తెగలో అమ్మాయిలకు త్వరగా పెళ్లి చేస్తారు. వాళ్లకు స్వేచ్ఛ తక్కువ. షబ్నమ్ మాత్రం పట్టుబట్టి టూరిజంలో మాస్టర్స్ చేసింది. 2019లో సోలో ట్రెక్స్ మొదలుపెట్టింది. సామాజిక అడ్డంకులు, భద్రతా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రయాణం కొనసాగించింది. బంధువులు కొంతమంది ‘‘అమ్మాయి ఒంటరిగా పర్వతాల్లో తిరిగితే  కుటుంబ ప్రతిష్ట దెబ్బతింటుంద’’ని హెచ్చరించారు. అయినా వెనుకడుగు వేయలేదు. 

స్పాన్సర్‌‌షిప్స్‌‌ లేకుండానే తను దాచుకున్న కొంత డబ్బుతో ట్రెక్కింగ్‌‌ చేసింది. ట్రాన్స్‌‌పోర్ట్ ఖర్చులు తగ్గించుకోవడానికి గంటల తరబడి నడుచుకుంటూ వెళ్లేది. ట్రెక్కింగ్‌‌కు అవసరమయ్యే వస్తువుల విషయంలో కూడా కాంప్రమైజ్‌‌ అయ్యేది. రాత్రిళ్లు తెలియని ప్రదేశాల్లో ధైర్యంగా స్టే చేసేది. హఠాత్తుగా మారే హిమాలయ వాతావరణం, సెల్‌‌ఫోన్ సిగ్నల్ లేని ప్రాంతాలు, అడవి మార్గాల్లో ఒంటరితనం.. ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంది. 

16 ప్రదేశాలు.. 

శ్రీనగర్ నుంచి 80 కి.మీ. దూరంలో వులర్ సరస్సు, హర్ముఖ్ శిఖరం మధ్య బండిపోరా జిల్లా ఉంటుంది. అక్కడ ఎక్కువగా గొర్ల కాపరులు ఉంటారు. ఆ ప్లేస్‌‌ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ.. ఇక్కడి ఆల్పైన్ మైదానాలు, సరస్సులు, రహస్య మార్గాల సమాచారం గుజ్జర్–బకర్వాల్ తెగ వాళ్లు చెప్పుకునే కథల్లో స్పష్టంగా ఉంటుంది. ఆ సమాచారంతో షబ్నమ్‌‌ 16 అద్భుతమైన ప్రాంతాలను మ్యాప్ చేసింది. 

నీటి వనరులు, అక్కడి వెదర్‌‌‌‌ కండిషన్స్‌‌, గ్రేజింగ్ రూట్లు, క్యాంపింగ్ స్పాట్లు.. అన్నీ రికార్డ్ చేసింది. జిల్లా టూరిజం ఆఫీసర్లు, అటవీ అధికారులు, స్థానిక పంచాయతీలతో కలిసి ట్రెక్కింగ్ రూట్లను స్ట్రక్చర్ చేసింది. ఇప్పుడు వాటిలో చందాజీ, నాగ్‌‌మార్గ్‌‌తోపాటు చాలా ప్రాంతాలను అధికారికంగా పర్యాటక ప్రాంతాలుగా గుర్తించారు. అవి ఇప్పుడు ఎంతోమంది సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.

అన్‌‌ఎక్స్‌‌ప్లోర్డ్ కశ్మీర్

తన అనుభవాలతో షబ్నమ్​ ‘అన్​ ఎక్స్‌‌ప్లోర్డ్‌‌ కశ్మీర్‌‌’ అనే పుస్తకం రాసింది. అందులో బండిపొరా లోయలు, మైదానాలు, పాస్టోరల్ రూట్లు, మూలికలు.. అన్నింటి గురించి  వివరించింది. ఈ బుక్‌ అక్కడి టూరిజం మాన్యువల్‌‌గా పనిచేస్తోంది. అంతేకాదు.. ఆమె రాసిన రెండో వాల్యూమ్ రిలీజ్‌‌కు సిద్ధంగా ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమెను ‘‘ట్రైబల్ టూరిజం పయనీర్’’గా ప్రశంసించారు. షబ్నమ్‌‌  ‘ట్రైబల్ గర్ల్స్ ట్రెక్కింగ్ గ్రూప్’ ద్వారా కశ్మీర్ మహిళలను అడ్వెంచర్స్​, ఎడ్యుకేషన్‌‌లో ప్రోత్సహిస్తోంది. అక్కడివాళ్లు షబ్నమ్‌‌ని 19వ శతాబ్దంలో హిమాలయాలను అన్వేషించిన బ్రిటిష్ ప్రయాణికురాలు పేరుతో ‘ఇసబెల్లా బర్డ్’ అని ప్రేమగా పిలుస్తుంటారు. 

రెండు గదుల నుంచి.. 

ఐదేళ్ల క్రితం ఈ ప్రాంతంలో రెండు చిన్న గెస్ట్‌‌ హౌజ్‌‌లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రతి సీజన్‌‌లో కొంతమంది ట్రెక్కర్లు అక్కడికి వెళ్లేవాళ్లు. వాళ్లు కూడా రాత్రిపూట బస చేయకుండానే తిరుగుప్రయాణం అయ్యేవాళ్లు. కానీ.. ఇప్పుడు చందాజీ, క్విల్ ముఖాం, నాగ్‌‌మార్గ్ దగ్గర్లోని గ్రామాల్లో 40–50 హోమ్‌‌స్టేలు ఏర్పాటుచేశారు. 

30 మందికి పైగా యువకులు ట్రెక్కింగ్ గైడ్‌‌లు, పోనీ హ్యాండ్లర్లుగా పనిచేస్తున్నారు. మరో 30 మంది మహిళలు ఫుడ్‌‌ వండడం, చేతితో అల్లిన ఉన్ని ఉత్పత్తులను అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు గొర్ల పెంపకంపై మాత్రమే ఆధారపడిన కుటుంబాలు ఇప్పుడు టూరిజం వల్ల ప్రతి సీజన్‌‌లో రూ.60,000 వరకు సంపాదిస్తున్నాయి.