కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం..  ఫొటో షూట్‎కు వచ్చి చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం..  ఫొటో షూట్‎కు వచ్చి చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి

మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫోటో షూట్‎ కోసం వెళ్లి ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. బొల్లారం ప్రాంతానికి చెందిన ఆంటోనీ (18), జోసెఫ్ (18), టోనీ (17) ముగ్గురు స్నేహితులు. సోమవారం (జూన్ 15) సరదాగా ఫొటో షూట్ కోసం ధర్మారం గ్రామం బాణమ్మ చెరువు దగ్గరకు వెళ్లారు. 

ఫొటోలు దిగుతున్న క్రమంలో హెడ్ ఫోన్స్ చెరువులో పడిపోయాయి. దీంతో హెడ్ ఫోన్స్ కోసం చెరువులోకి దిగటంతో ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు మృతి చెందారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

 గజ ఈతగాళ్ల సహయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఆంటోని మృతదేహాన్ని బయటకు వెలికితీశారు. మరొకరి డెడ్ బాడీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చేతికి అందివచ్చిన కొడుకులు చనిపోవడంతో మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.