మతం అడిగిన తర్వాతే కాల్చి చంపిర్రు: పహల్గాం మాదిరిగానే కుల్గాం టెర్రర్ ఎటాక్..!

మతం అడిగిన తర్వాతే కాల్చి చంపిర్రు: పహల్గాం మాదిరిగానే కుల్గాం టెర్రర్ ఎటాక్..!

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన కుల్గాం ఉగ్రదాడిలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2025, ఏప్రిల్‎లో జమ్మూ కశ్మీర్‎లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి మాదిరిగానే కుల్గాం టెర్రర్ ఎటాక్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులను మతం అడిగి ఆ తర్వాత కాల్చి చంపేసినట్లుగానే.. కుల్గాంలో కూడా బాధితుల మతం అడిగి ఆ తర్వాతే హతమార్చారు.  

అసలేం జరిగిందంటే..?

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో 2026, జూలై 31న ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఓ ఇటుక బట్టీ వద్ద పనిచేస్తున్న వలస కూలీలపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలు దీపక్ రాత్రే (24), భూపేంద్ర భైనా (28)గా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మృతుల కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. 

ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో చాలా మంది వలస కార్మికులు ఉన్నప్పటికీ పేర్లు, కులం, మతం అడిగిన తర్వాతే తమ వాళ్లను ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపినట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో చనిపోయిన ఇద్దరే హిందువులు కావడంతో మృతుల కుటుంబ సభ్యుల ఆరోపణలకు మరింత బలం చేకూరింది. పోలీసులు కూడా ఈ కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడి 2025, ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి భయానక జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది.

పహల్గాంలో మారణహోమం:

2025, ఏప్రిల్ 22 భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ప్రకృతి అందాలకు నిలయమైన జమ్ము కాశ్మీర్‎లో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురయ్యేలా ఉగ్ర దాడి జరిగింది. బైసరన్ మైదానం ప్రాంతంలోని పహల్గాంలో ప్రకృతి అందాలు వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఉగ్రవాదుల తూటాలకు 26 మంది టూరిస్టులు బలయ్యారు. కేవలం ఒక వర్గానికి చెందిన వారినే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి దాయాది దేశానికి ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పింది.