గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత స్టార్ మహిళా బాక్సర్లు ప్రియా ఘాంఘాస్, సాక్షి చౌదరి, అరుంధతి చౌదరి పసిడి పంచ్‌తో అదరగొట్టారు. శనివారం (ఆగస్ట్ 1) జరిగిన మహిళల బాక్సింగ్ పోటీల్లో ప్రియా ఘాంఘాస్, సాక్షి చౌదరి, అరుంధతి చౌదరి స్వర్ణ పతకాలతో మెరిశారు. 60 కిలోల విభాగంలో ప్రియా ఘాంఘాస్, 70 కిలోల విభాగంలో అరుంధతి చౌదరి, 51 కిలోల విభాగంలో సాక్షి చౌదరి పసిడి పతకం కైవసం చేసుకున్నారు.
అంతకుముందు 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్, 57 కేజీల విభాగంలో జాస్మిన్ గోల్డ్ మెడల్స్ సాధించారు. దీంతో బాక్సింగ్ విభాగంలో భారత్‌కు శనివారం (ఆగస్ట్ 1) ఒక్కరోజే ఐదు స్వర్ణ పతకాలు లభించాయి. భారత మహిళా బాక్సర్లు బ్యాక్ టూ బ్యాక్ పతకాలతో చరిత్ర సృష్టించారు. ఓవరాల్‌గా కామన్వెల్త్ గేమ్స్ 2026లో ఇండియా 11 గోల్డ్ మెడల్స్ సాధించింది.
సాక్షి చౌదరి (51 కేజీలు):
మహిళల 51 కేజీల విభాగం ఫైనల్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన రూబీ వైట్‌ను 5-0 తేడాతో భారత స్టార్ బాక్సర్ సాక్షి చౌదరి చిత్తు చేసింది. ప్రత్యర్థిపై సాక్షి పంచుల వర్షం కురిపించింది. సాక్షి దెబ్బకు రూబీ వైట్ బెంబెలేత్తింది. ఇంగ్లాండ్ బాక్సర్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆటను ఏకపక్షం చేసినసాక్షి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
ప్రియా ఘాంఘాస్ (60 కేజీలు):
60 కేజీల లైట్‌వెయిట్ విభాగంలో భారత మహిళా బాక్సర్ ప్రియా ఘాంఘాస్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్ పోరులో కెనడాకు చెందిన మేరీ-బాథౌల్ అల్-అహ్మదియాపై పంచ్‌లతో విరుచుకుపడిన భారత బాక్సర్ 4-1 తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది.
అరుంధతి చౌదరి (70 కేజీలు):
మహిళల 70 కేజీల విభాగంలో ఇంగ్లాండ్‌కు చెందిన చాంటెల్ రీడ్‌ను భారత స్టార్ బాక్సర్ అరుంధతి చౌదరి చిత్తుచేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో ఇంగ్లాండ్ ప్లేయర్‌ను చిత్తు చేసి అరుంధతి రాయ్ పసిడి పతకం కైవసం చేసుకుంది.
