- తొలి బోనం సమర్పించనున్న మంత్రి పొన్నం దంపతులు
- అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- 2న బోనాల జాతర, 3న భవిష్యవాణి, 4న ఘటాల ఊరేగింపు
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు..
- ఫేస్ రికగ్నేషన్ కెమెరాలతో నిఘా
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దందపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం తొలి బోనం సమర్పించడంతో జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సాధారణ భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. జాతరలో భాగంగా ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ప్రధాన జాతర (బోనాలు), సోమవారం (ఆగస్టు 3) భవిష్యవాణి (రంగం), మంగళవారం (ఆగస్టు 4)న ఘటాల ఊరేగింపు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
అమ్మవారిని దర్శించుకునేందుకు మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు ఆలయానికి విచ్చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మరోవైపు, లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, ట్రాఫిక్, తాగు నీరు, వైద్యం, టాయిలెట్లు, పారిశుధ్యంపై అధికారులు
ప్రత్యేక దృష్టి సారించారు.
2,500 మంది పోలీసులతో బందోబస్తు
ఈ నెల 2, 3 తేదీల్లో జరగనున్న ఉత్సవాలకు 25 లక్షల నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని శాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. బోనాల సందర్భంగా 2,500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో 2వ తేదీ నుంచి 4వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ఈసారి భద్రత కోసం ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో అడ్వాన్స్‌డ్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. శాంతిభద్రతల దృష్ట్యా ఆలయ పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు మొత్తం 7 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
బోనం తీసుకొచ్చే మహిళలు, జోగినీలు నేరుగా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాన్ని కేటాయించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించారు. తాగు నీటికి ఇబ్బందులు లేకుండా జలమండలి అధికారులు 5 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీలో ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్ 90102 03626 ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో మట్టి బోనం..
మహంకాళి అమ్మవారికి రాష్ట్రంలోని 32 జిల్లాలకు చెందిన తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగంలో పనిచేస్తున్న 175 మంది మహిళా కళాకారులు ఆదివారం మట్టి బోనం సమర్పిస్తారని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ జీవీ వెన్నెల ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతారని తెలిపారు.
