గ్రౌండ్‌లోనే కొట్టుకున్న భారత్-శ్రీలంక ప్లేయర్స్.. కారణం వైభవేనా?

గ్రౌండ్‌లోనే కొట్టుకున్న భారత్-శ్రీలంక ప్లేయర్స్.. కారణం వైభవేనా?

Vaibhav Suryavanshi Clashes With Sri Lanka A Players: దంబుల్లా వేదికగా శ్రీలంక A జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ A టీమ్ సూపర్ ఓవర్‌లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి కంటే కూడా మ్యాచ్ ముగిసిన తర్వాత భారత యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మైదానంలో ప్రవర్తించిన తీరు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ గొడవకు దిగడమే కాకుండా, ఒక ప్లేయర్‌ను ఫిజికల్‌గా నెట్టేయడం (Pushed a player) తీవ్ర చర్చకు దారితీసింది.

అసలేం జరిగిందంటే?: 
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ A జట్టు 265 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా, ఛేజింగ్‌కు దిగిన శ్రీలంక A కూడా 50 ఓవర్లలో 265/9 స్కోరు చేయడంతో మ్యాచ్ టై (Tie) అయింది. ఆ తర్వాత వెలుతురు సమస్యల (Light issues) కారణంగా అసలు సూపర్ ఓవర్ జరుగుతుందా లేదా అనే దానిపై కాసేపు డ్రామా నడిచింది. చివరకు సూపర్ ఓవర్ నిర్వహించగా.. మొదట బ్యాటింగ్ చేసిన లంక 6 బంతుల్లో 16 పరుగులు చేసింది.

చేజింగ్‌లో ఫెయిల్యూర్.. ఆపై కొట్లాట: 
శ్రీలంక విధించిన 17 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ తరఫున వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్జ్ క్రీజులోకి వచ్చారు. కానీ, వారిద్దరూ కలిసి కేవలం 10 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో భారత్ ఓటమి పాలైంది. ఇక మ్యాచ్ అయిపోయాక వైభవ్ వెనుతిరిగి వెళ్తున్న సమయంలో అసలు రచ్చ మొదలైంది. గెలిచిన జోష్‌లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్న శ్రీలంక ప్లేయర్లు వైభవ్‌ను ఉద్దేశించి ఏదో అన్నట్లు కనిపించింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు.. కోపంతో లంక ప్లేయర్ల వైపు దూసుకెళ్లాడు. శ్రీలంకన్ ఆటగాళ్లు అతడిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, వినకుండా ఒక లంక ప్లేయర్‌ను గట్టిగా నెట్టేశాడు. అక్కడితో ఆగకుండా వెనక్కి వెళ్తూ పదే పదే లంకేయులని చూస్తూ ఏదో బూతులు తిట్టాడు. 

ఐపీఎల్‌లో ధోనీ కాళ్లు మొక్కుతావు.. ఇక్కడేమో కొట్లాటలా?: 
వైభవ్ సూర్యవంశీ గ్రౌండ్‌లో ప్రవర్తించిన ఈ అగ్రెసివ్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. చిన్న వయసులోనే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదంటూ క్లాస్ పీకుతున్నారు. వైభవ్, నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి, మేము అర్థం చేసుకోగలం.. కానీ నువ్వు ఇక్కడ దేశానికి రిప్రజెంట్ చేస్తున్నావు అనే ముచ్చట మరువకు, "ఐపీఎల్‌లో చూస్తేనేమో పద్ధతిగా ఎంఎస్ ధోనీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటావు.. తీరా ఇండియా జెర్సీ వేసుకుని ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేసరికి ఇలా దాడులకు (Physical brawl) దిగుతావా? ఇది అస్సలు బాలేదు బ్రో! అంటూ అతడిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.