
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికతో ఏపీలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది.. అసెంబ్లీ ఎన్నికలను మించిన రేంజ్ లో రాజకీయ రణరంగంలా మారింది పులివెందుల. పులివెందుల జడ్పీటీసీతో సహా ఒంటిమిట్ట ఉపఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఈ క్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు వైసీపీ కీలక నేత సతీష్ రెడ్దని హౌస్ అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇదిలా ఉండగా.. తనను ఓటు వేసేందుకు వెళ్లనివ్వండి అంటూ ఓ ఓటర్ పోలీసు కాళ్ళు పట్టుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చారు. మాములుగా అయితే.. పోలీసులు దగ్గరుండి ఓటర్లను క్యూలో ఓటు వేసేందుకు పంపుతారు కానీ.. పులివెందులలోని ఓ పోలింగ్ కేంద్రం దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీసులు మాత్రం ఓటర్లను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఓటర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.తమను ఓటు వేయకుండా అడ్డుకుంటున్న పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఓటర్లు.
ఓ ఓటరు ఏకంగా పోలీసుల కాళ్ళు పట్టుకొని తమను ఓటు వేసేందుకు పంపాలంటూ వేడుకోవడం అందరిని కదిలించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వగా.. నెటిజన్లు సైతం ఈ ఘటనకు చలించిపోతున్నారు. అయితే.. సదరు ఓటర్లను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు, అది ఏ పోలింగ్ కేంద్రం వంటి వాటిపై స్పష్టత లేదు.
ఈ అంశంలో కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది ప్రతిపక్ష వైసీపీ. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిందో అనడానికి ఈ ఘటన నిదర్శనమని అంటోంది వైసీపీ. ఒక్క జడ్పీటీసీ స్థానం గెలవడం కోసం టీడీపీ ఈ స్థాయిలో అరాచకానికి ఒడిగట్టిందని.. ఓటర్లను అడ్డుకొని యథేచ్ఛగా రిగ్గింగ్ కి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ శ్రేణులు. మరి, సార్వత్రిక ఎన్నికలను తలపించే రేంజ్ లో పొలిటికల్ హీట్ పెంచిన పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో ఏ పార్టీ నెగ్గుతుందో వేచి చూడాలి.
పోలీసులు ఎందుకు ఓటర్లను అడ్డుకున్నారు అనే విషయంపై స్పష్టత లేదు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ చర్యలు తీసుకున్నారని కొందరు అంటుంటే, మరికొందరు ఓటర్లను ప్రభావితం చేయడానికే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా, ఓటు హక్కు అనేది ఒక పౌరుడి ప్రాథమిక హక్కు.. దాన్ని వినియోగించుకోవడానికి వచ్చిన ప్రజలను ఇలా అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.