తెలంగాణ ఆర్టీసీ టూరిజానికి తిరుమల దర్శనం టికెట్లు ఇవ్వాలి: సీపీఐ నారాయణ

తెలంగాణ ఆర్టీసీ టూరిజానికి తిరుమల దర్శనం టికెట్లు ఇవ్వాలి: సీపీఐ నారాయణ

తిరుమల శ్రీవారి దర్శనం కోసం గతంలో మాదిరిగానే తెలంగాణ టూరిజం కార్పొరేషన్​కు రోజుకు 300 దర్శన టికెట్లు కేటాయించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి ఆయన లేఖ రాశారు. 

గతంలో తెలంగాణ టూరిజం ద్వారా వచ్చే భక్తులకు టీటీడీ రోజుకు 300 టికెట్లు ఇచ్చేదని, ఇందులో నాలుగు బస్సులకు 172, విమానాల ద్వారా వచ్చే వారికి 50, కస్టమైజ్డ్ ప్యాకేజీల ద్వారా 78 టికెట్లు ఉండేవని గుర్తుచేశారు. దీనివల్ల టీటీడీకి  ఆదాయం రావడంతోపాటు తెలంగాణ టూరిజానికి మంచి గుర్తింపు లభించేదని తెలిపారు.అయితే,  టీటీడీ ఈ కోటాను డిసెంబర్ 2024 నుంచి నిలిపివేసిందని, దీనివల్ల తెలంగాణ నుంచి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. వెంటనే స్పందించి పాత పద్ధతిలోనే ప్రతిరోజూ 300 టికెట్లను తెలంగాణ టూరిజం కార్పొరేషన్​కు కేటాయించాలని కోరారు.