- నల్గొండ జిల్లాలో రూ. 20 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్‌ఐ
- వేయింగ్ మెషీన్ లైసెన్స్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన ఖమ్మం లీగల్ మెట్రాలజీ ఆఫీసర్
హాలియా, వెలుగు : భూమి పట్టా మార్పిడి కోసం లంచం తీసుకున్న నల్గొండ జిల్లా గుర్రంపోడ్ ఆర్‌ఐ మహమ్మద్ అబ్దుల్ హకీంను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీసర్ జగదీశ్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం ఊట్లపల్లికి చెందిన షేక్ గోరేమియా కుటుంబ సభ్యులకు ఏడు ఎకరాల భూమి ఉంది. ఇందులో 1.15 ఎకరాల భూమి అదే గ్రామానికి మరో రైతు పేరిట పట్టా అయింది. ఆ భూమిని తిరిగి తనపై పట్టా చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలంటూ గోరేమియా గుర్రంపోడ్ తహసీల్దార్ కరుణశ్రీకి అర్జీ పెట్టుకున్నాడు.
దీంతో ఆ భూమికి సంబంధించిన వివరాలను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని తహసీల్దార్ ఆర్‌ఐ మహమ్మద్ అబ్దుల్ హకీంను ఆదేశించింది. తర్వాత పట్టా విషయంపై గోరేమియా ఆర్‌ఐని కలువగా.. రూ. 50 వేలు ఇస్తే పని పూర్తవుతుందని చెప్పడంతో గతంలోనే రూ. 30 వేలు ఇచ్చాడు. మిగిలిన రూ. 20 వేలు ఇవ్వాలని ఆర్‌ఐ ఒత్తిడి చేయడంతో రైతు గోరేమియా నల్గొండ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు సోమవారం మధ్యాహ్నం గుర్రంపోడ్ తహసీల్దార్ ఆఫీస్‌లో ఆర్‌ని కలిసి రూ. 20 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఆర్‌ఐ మహమ్మద్ అబ్దుల్ హకీంను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని విచారించి, రికార్డులను పరిశీలించారు.
వేయింగ్ మెషీన్ లైసెన్స్ కోసం...
ఖమ్మం టౌన్, వెలుగు : వేయింగ్ మెషీన్ ఏర్పాటు లైసెన్స్ జారీ చేసేందుకు లంచం తీసుకున్న తూనికలు, కొలతల శాఖ అధికారిని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలో లారీ వెయింగ్ మెషీన్ ఏర్పాటు చేసుకున్నాడు. దానికి లైసెన్స్ జారీ కోసం ఏజెన్సీ సంస్థకు చెందిన వ్యక్తి జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి ప్రవీణ్‌కుమార్‌ను కలువగా.. రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. రూ. 5 వేలకు ఒప్పుకున్నాడు. తర్వాత సదరు వ్యక్తి ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశాడు. దీంతో వివరాలు సేకరించిన ఏసీబీ ఆఫీసర్లు సోమవారం ప్రవీణ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.
