- ఇప్పటి వరకు 5 వేల మందికి పూర్తి
- ఈ నెల మొత్తం క్లాసులు నిర్వహిస్తామంటున్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్టీ గురుకులాల్లో ప్రస్తుతం వార్షిక పరీక్షల సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పది, ఇంటర్ పరీక్షల కోసం స్టూడెంట్లు ప్రిపేర్ అవుతున్నారు. గురుకుల ఫ్యాకల్టీ సైతం స్టడీ అవర్స్ నిర్వహిస్తోంది. అయితే పరీక్షల సమయంలో విద్యార్థులు భయం, ఒత్తిడి, టెన్షన్ కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆందోళనను పొగేట్టేందుకు గురుకుల అధికారులు చర్యలు చేపట్టారు. ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలో ఉన్న 181 ఇన్ స్టిట్యూషన్స్ లో పది, ఇంటర్ చదివే స్టూడెంట్స్ 20 వేల మంది ఉన్నారు.
వీరికి అన్ని ఉమ్మడి జిల్లాల్లో ప్రముఖ సైకాలజిస్టులను నియమించి గత 3 రోజులుగా సైకాలజీ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 9 వేల మందికి సైకాలజీ క్లాసులు పూర్తి చేశారు. స్ర్టెస్ మేనేజ్ మెంట్, టైమ్ మేనేజ్ మెంట్, రిలాక్సేషన్ , పాజిటివ్ థింకింగ్, స్టడీ ప్లానింగ్ వంటి అంశాలపై క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈనెల మొత్తం క్లాసులు నిర్వహిస్తామని ఎస్టీ గురుకుల సొసైటీ అధికారులు చెబుతున్నారు.
పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించేందుకు సైకాలజిస్టులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పరీక్షల సమయంలో సుమారు 40 శాతం మంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, అందరికీ కౌన్సెలింగ్ అవసరమని అధ్యయనాలు చెప్పటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి క్లాసులు ఏటా ఎక్కువ సార్లు నిర్వహించాలని స్టూడెంట్స్ కోరుతున్నారు.
ఎంతో ఉపయోగపడుతున్నాయి: సాయి, దాసు, స్టూడెంట్స్
పరీక్షల నేపథ్యంలో ఎస్టీ గురుకులాల్లో సైకాలజీ క్లాసులు మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఒత్తిడి, టెన్షన్ తగ్గేందుకు సైకాలజిస్టులు ఉదాహారణలతో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రతి స్టూడెంట్ కు పరీక్షలంటే ఎంతో భయం, టెన్షన్ ఉంటుంది. ఈ క్లాసుల వల్ల గురుకుల స్టూడెంట్స్కు ఆ భయం తగ్గుతుంది.
