Allu Arjun: బన్నీతో 'ధురంధర్' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్.. ఐకాన్ స్టార్‌ ఖాతాలో మరో వెయ్యి కోట్ల బొమ్మ?

Allu Arjun: బన్నీతో 'ధురంధర్' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్.. ఐకాన్ స్టార్‌ ఖాతాలో మరో వెయ్యి కోట్ల బొమ్మ?

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.  ప్రస్తుతం  అట్లీ దర్శకత్వంలోని సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ AA22 లో నటిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' నుంచి మొన్నటి 'ధురంధర్' వరకు తన మేకింగ్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్.. ఇప్పుడు అల్లు అర్జున్‌తో ఒక భారీ యాక్షన్ విజువల్ వండర్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఆదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్!

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' 2025 డిసెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సుమారు రూ1,100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది. ఈ జోరులోనే ఆదిత్య ధర్ తన చిరకాల కల అయిన ఒక భారీ కథను అల్లు అర్జున్‌కు వినిపించినట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రాజెక్ట్ 'ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ' పేరుతో విక్కీ కౌశల్‌తో మొదలవ్వాల్సి ఉంది. కానీ బడ్జెట్ కారణాలు, 'కల్కి 2898 AD' లోని కర్ణ క్యారెక్టర్‌తో పోలికలు ఉంటాయన్న ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అదే కథను సరికొత్తగా, బన్నీ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా మార్పులు చేసి ఆదిత్య ధర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు?

ఆదిత్య ధర్ ప్రస్తుతం తన భారీ సీక్వెల్ 'ధురంధర్ 2' పనుల్లో బిజీగా ఉన్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రం 19 మార్చి 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీని తర్వాతే అల్లు అర్జున్-ఆదిత్య ధర్ కాంబినేషన్‌పై ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బన్నీ సైతం ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాతే ఈ కొత్త సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారట. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే, అల్లు అర్జున్ ఖాతాలో మూడో రూ.1,000 కోట్ల సినిమా చేరడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు

 

అల్లు అర్జున్ లైనప్

ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తుంటే ఆయన బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'AA22' మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 2026 నవంబర్‌లో వచ్చే అవకాశం ఉంది. ఇక  'AA23 ' చిత్రానికి లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్ వీడియోతో అంచనాలు పెంచేసింది. ఈ చిత్రం 2026 జూన్, జూలైలో సెట్స్ పైకి వెళ్లనుంది. మరో వైపు సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ ఒకటి చర్చల దశలో ఉంది.  ఆదిత్య ధర్ , అల్లు అర్జున్ భారీ యాక్షన్ మూవీపై మరిన్ని అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.