తెలంగాణ టెంపుల్ టూరిజంలో 7 సర్క్యూట్లు ఇలా.. సరికొత్తగా పర్యాటక వెలుగులు

తెలంగాణ టెంపుల్ టూరిజంలో 7 సర్క్యూట్లు ఇలా.. సరికొత్తగా పర్యాటక వెలుగులు

హైదరాబాద్, వెలుగు: పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త టూరిజం పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రకృతి, సంస్కృతి, ఆధ్యాత్మికత కలగలిసిన ప్రాంతాలను ‘తెలంగాణ టూరిజం సర్క్యూట్లు’గా తీర్చిదిద్దేలా కసరత్తు ముమ్మరం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 27 సర్క్యూట్లును ఏర్పాటు చేయడంతో పాటు పలు అభివృద్ధి పనులు టూరిజం శాఖ ఇటీవలే నిర్ణయించింది. తొలి దశలో 7 సర్క్యూట్లు అభివృద్ధి చేయనున్నారు.

సర్క్యూట్ల అభివృద్ధి ఇలా.. 

  • నల్లమల సర్క్యూట్‌‌ : నాగర్​కర్నూల్​ జిల్లాలోని అమ్రాబాద్​అడవులు, కృష్ణా నది తీర ప్రాంతాలు, నది మధ్యలో దీవులు, శ్రీశైలం ప్రాజెక్టు దీని పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే సఫారీ ఉండగా, అనువైన చోట్ల ట్రెక్కింగ్, జిప్​రైడింగ్  ఏర్పాట్లు చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళిక రూపొందించారు. 
  • వరంగల్‌‌ సర్క్యూట్ : వరంగల్ కోట, దాని చుట్టూ ఉన్న ఆలయాలు, చారిత్రక స్మారకాలతో సాంస్కృతిక, ఆధ్యాత్మిక టూరిజంగా తీర్చిదిద్దనున్నారు. 
  • రామప్ప సర్క్యూట్ : భూపాలపల్లి, ములుగు జిల్లాలోని ఈ సర్క్యూట్​లో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ప్రఖ్యాత మేడారం ‘సమ్మక్క– సారలమ్మ’ ఆలయం, లక్నవరం సరస్సు, బొగత జలపాతం లాంటి చోట్ల ఏర్పాట్లు చేయనున్నారు.  ఇది ఆధ్యాత్మిక, సాంస్కృతిక సర్క్యూట్​గా ఉండబోతోంది.
  • నాగార్జునసాగర్‌‌ సర్క్యూట్ : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఈ సర్క్యూట్​లో నాగార్జన సాగర్​ ప్రాజెక్టు, నందికొండ, బుద్ధవన క్షేత్రం కీలకంగా ఉంటాయి. ఎకో,  అడ్వెంచర్‌‌ టూరిజం సర్క్యూట్​గా తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగా బుద్ధవనంలో వెల్‌‌నెస్‌‌, మెడిటేషన్‌‌ సెంటర్లను అభివృద్ధి చేయనున్నారు. ప్రధానంగా బౌద్ధ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టనున్నారు.
  • వికారాబాద్‌‌ సర్క్యూట్ : హైదరాబాద్​ సిటీ పక్కనే ఉన్న వికారాబాద్​ సర్క్యూట్​పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడ్తోంది. ఎకో టూరిజం, ఫారెస్ట్‌‌ రిసార్ట్‌‌లు, ట్రెక్కింగ్‌‌కు ఈ సర్క్యూట్‌‌ అనువుగా ఉంటుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు గ్లాంపింగ్స్‌‌తో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. 
  • ట్రైబల్‌‌ సర్క్యూట్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, పర్ణశాల, కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యంతో గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా ఈ సర్క్యూట్‌‌ను తీర్చిదిద్దాలని సర్కారు నిర్ణయించింది. ఆధ్యాత్మికతతో పాటు ఎకో టూరిజం సర్క్యూట్​గా అభివృద్ధి చేయనున్నారు. 
  • చార్మినార్‌‌ సర్క్యూట్ : హైదరాబాద్‌‌లో చార్మినార్, లాడ్‌‌బజార్‌‌, మక్కా మసీదు, చౌమొహల్లా ప్యాలెస్, సాలార్‌‌ జంగ్‌‌ మ్యూజియం వంటి చారిత్రక స్థలాలు ఉన్నాయి. దీనిని సాంస్కృతిక టూరిజంగా తీర్చిదిద్దాలని ఇప్పటికే నిర్ణయించారు. వీటితో పాటు యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ, మెదక్, నల్గొండ, గోల్కొండ వంటి ఇతర ప్రాంతాలను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు పర్యాటకశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

గేమ్‌‌ చేంజర్‌‌గా సర్క్యూట్లు 

తెలంగాణ టూరిజం పాలసీ రాష్ట్ర పర్యాటక రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. టూరిజం రంగంలో గేమ్‌‌ చేంజర్‌‌గా ఈ ‘టూరిజం సర్క్యూట్లు’ నిలవనున్నాయి. రాష్ట్రాన్ని గ్లోబల్‌‌ టూరిజం హబ్‌‌గా మార్చాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రకృతి, సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రాంతాలను కలిపి సర్క్యూట్లుగా ఏర్పాటు చేస్తున్నాం. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాం. నల్లమల అడవుల నుంచి చార్మినార్‌‌ చారిత్రక వీధుల వరకు, రామప్ప ఆలయం నుంచి నాగార్జునసాగర్‌‌ బుద్ధవనం వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
- మంత్రి జూపల్లి కృష్ణారావు