తెలంగాణ టూరిజం కొత్త రూపు.. గేమ్ ఛేంజర్‎గా 27 సర్క్యూట్లు

తెలంగాణ టూరిజం కొత్త రూపు.. గేమ్ ఛేంజర్‎గా 27 సర్క్యూట్లు

హైదరాబాద్, వెలుగు: పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త టూరిజం పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రకృతి, సంస్కృతి, ఆధ్యాత్మికత కలగలిసిన ప్రాంతాలను ‘తెలంగాణ టూరిజం సర్క్యూట్లు’గా తీర్చిదిద్దేలా కసరత్తు ముమ్మరం చేస్తోంది. 

రాష్ట్ర వ్యాప్తంగా 27 సర్క్యూట్లు

రాష్ట్రంలో మొత్తం 27 సర్క్యూట్లును ఏర్పాటు చేయడంతో పాటు పలు అభివృద్ధి పనులు టూరిజం శాఖ ఇటీవలే నిర్ణయించింది. ఇందులో యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, వేములవాడ, అలంపూర్-, సోమశిల, రామప్ప, కాళేశ్వరం, మెదక్, వరంగల్, నల్లగొండ, పాలకుర్తి, కరీంనగర్, చార్మినార్, హైదరాబాద్,- రంగారెడ్డి, -మేడ్చల్, సిద్దిపేట, నల్లమల, శ్రీరాంసాగర్,  జన్నారం, ట్రైబల్‌‌ క్లస్టర్, నాగార్జునసాగర్, వికారాబాద్, మహబూబ్‌‌నగర్‌‌, పోచంపల్లి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, కొత్తకోట, కోరటికల్‌‌ -కుంట్ల, పొచ్చెర, గాయత్రి, కొండాపూర్‌‌, ధూళికట్ట-, నేలకొండపల్లి-, బుద్ధవనం-, ఫణిగిరి,- గాజులబండ తదితర ప్రాంతాలతో సర్క్యూట్లను ఏర్పాటు చేయనున్నారు. టూరిజం పాలసీలో భాగంగా రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు ఉపాధి కల్పించాలని పర్యాటక శాఖ లక్ష్యం నిర్దేశించుకున్నది.

 తొలి విడత 8 సర్క్యూట్లలో అభివృద్ధి పనులకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా నల్లమల, రామప్ప, నాగార్జునసాగర్‌‌, వికారాబాద్, వరంగల్, చార్మినార్‌‌, ట్రైబల్‌‌ సర్క్యూట్లను తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఈ సర్క్యూట్లలో ఫుడ్‌‌ ప్లాజాలు, అధునాతన టాయిలెట్లు, రవాణా సౌకర్యాలు, హోటళ్లు, రిసార్ట్‌‌లు తదితర మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రత్యేక టూరిజం ప్రాంతాల్లో వెల్‌‌నెస్‌‌ సెంటర్లు, గోల్ఫ్‌‌ టూరిజం, సాహస క్రీడల కోసం సౌకర్యాలు కల్పించేలా ప్లాన్‌‌ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రపోజల్స్‌‌ రెడీ చేసిన ఆఫీసర్లు, పనులు చేపట్టేందుకు త్వరలోనే టెండర్లను 
ఆహ్వానించనున్నారు.