వేలమంది బాధితుల కన్నీళ్లు తుడుస్తున్న ప్రజావాణి.. ఆన్లైన్ చేస్తే విప్లవాత్మక మార్పులు

 వేలమంది బాధితుల కన్నీళ్లు తుడుస్తున్న  ప్రజావాణి..  ఆన్లైన్ చేస్తే విప్లవాత్మక మార్పులు

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రజల ముంగిటకి చేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి  ప్రారంభించిన ‘ప్రజావాణి’ కార్యక్రమం ఒక ఆశాదీపంలా మారింది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో హైదరాబాద్‌‌లోని ప్రజాభవన్ వేలమంది బాధితుల కన్నీళ్లను తుడుస్తోంది. అయితే, ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రపంచస్థాయి టెక్నాలజీతో అనుసంధానించాల్సిన సమయం అవసరం ఉంది. ‘ప్రజావాణి’ని పూర్తిస్థాయిలో ఆన్‌‌లైన్  చేయడం ద్వారా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు.


ప్రస్తుతం ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్  ప్రజాభవన్,  తెలంగాణ సచివాలయంకు వస్తున్నారు. ఇందులో ఎదురవుతున్న ప్రధాన ఇబ్బంది ఆర్థికభారం. ఆదిలాబాద్, గద్వాల్, భద్రాద్రి కొత్తగూడెం వంటి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే సామాన్యులకు ఖర్చులు భారంగా మారుతున్నాయి. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం క్లిష్టంగా ఉంది. ఒక్కోసారి వేల సంఖ్యలో అర్జీలు రావడం వల్ల అధికారులకు ప్రతి ఒక్కరితో మాట్లాడే సమయం తక్కువగా ఉంటోంది. జిల్లాల వారీగా వెబ్‌‌సైట్లు ఉన్నప్పటికీ, వాటి మధ్య సమన్వయం లోపిస్తోంది. సీఎం కార్యాలయం  నేరుగా పర్యవేక్షించేలా ఒక కేంద్రీకృత ఆన్‌‌లైన్ పోర్టల్ ఉండాలి.  ప్రతి అర్జీకి ఒక 'యూనిక్ ఐడీ' కేటాయించి, అది ఏ టేబుల్ మీద ఉందో దరఖాస్తుదారుడికి ఎస్​ఎంఎస్​ ద్వారా అప్‌‌డేట్ వెళ్లాలి. సచివాలయంలో పెండింగ్‌‌లో ఉన్న పనుల కోసం ప్రత్యేక కేటగిరీని కేటాయించాలి.  జిల్లా కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించిన అర్జీలను  తక్షణమే చూసి  పరిష్కరించేలా లాగిన్ సదుపాయం ఉండాలి.

ఆన్‌‌లైన్ చేయడం వల్ల విప్లవాత్మక ప్రయోజనాలు 

పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది.  ఒకసారి అర్జీ ఆన్‌‌లైన్ అయ్యాక, దానిని ఏ అధికారి కూడా విస్మరించలేరు. నిర్ణీత కాల పరిమితి దాటితే ఆటోమేటిక్‌‌గా పై అధికారులకు అలర్ట్ వెళ్తుంది.  ఇది అవినీతిని తగ్గించి, పనివేగాన్ని పెంచుతుంది. ముఖ్యమంత్రి  తన కార్యాలయం నుంచే ఏ జిల్లాలో ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, ఏ శాఖలో ఎక్కువ పెండింగ్ ఉన్నాయి అనేది ఒక్క క్లిక్‌‌తో చూడవచ్చు. డేటా అనలిటిక్స్ ద్వారా ఏ ప్రాంతంలో ఏ సమస్య (ఉదా: భూ సమస్యలు లేదా పెన్షన్లు) ఎక్కువగా ఉందో తెలుసుకుని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.

అమలు దిశగా ప్రభుత్వానికి సూచనలు 

సీఎం ‘ప్రజావాణి’ని  సామాన్యులు కూడా వాడేలా సులభమైన మొబైల్ యాప్ రూపొందించాలి. సీఎం ప్రజావాణి ప్రజాభవన్ ఆన్​లైన్​ సిస్టమ్ వెబ్ పోర్టల్ చేయాలి.  ప్రజాభవన్‌‌ వెబ్​సైట్​లో ఇచ్చే ఫిర్యాదులను కూడా వెంటనే స్కాన్ చేసి  ఆన్‌‌లైన్  సిస్టమ్‌‌లోకి ఎక్కించాలి. ఒక ఫిర్యాదుపై 15 రోజుల్లోగా చర్య తీసుకోకపోతే ఆటోమేటిక్‌‌గా ఆ అధికారికి 'షోకాజ్ నోటీసు' వెళ్లేలా సిస్టమ్ ఉండాలి. ఇది అధికారుల్లో  బాధ్యతను పెంచుతుంది. చాలా ఫిర్యాదులు పెండింగ్‌‌లో ఉంటున్నాయి.  ఏ ఫైల్ ఏ సెక్షన్​లో ఆగిపోయిందో  ప్రజలకు తెలిసేలా ‘సెక్రటేరియట్ డ్యాష్‌‌బోర్డ్​’ను  దీనికి అనుసంధానించాలి.

వీడియో కాన్ఫరెన్స్ ‘ప్రజా దర్బార్’

నెలకొకసారి సీఎం సచివాలయం నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల బాధితులతో ముఖాముఖి మాట్లాడాలి. ప్రజలు తాము హైదరాబాద్ వెళ్లకపోయినా సీఎం తమ సమస్య వింటున్నారనే భరోసా పొందుతారు. సమస్య పరిష్కారం అయిన తర్వాత దరఖాస్తుదారుడి నుంచి ‘సంతృప్తి స్థాయి’ని రేటింగ్ రూపంలో తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉంది. అదే టెక్నాలజీని సామాన్యుడి కన్నీళ్లు తుడవడానికి వాడితే,  ‘ప్రజావాణి’ దేశంలోనే అత్యుత్తమ పారదర్శక పాలనా కార్యక్రమంగా నిలుస్తుంది. హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండానే, తన సొంతగ్రామంలో ఉండి సీఎంకు ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పిస్తే, అది నిజమైన ‘ప్రజా ప్రభుత్వం’ అనిపించుకుంటుంది.

- రాజు, కరీంనగర్

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.