న్యూఢిల్లీ, వెలుగు: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ సీనియర్ నేత డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అధిష్టానాన్ని కోరారు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జాతీయ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను ఆయన వేర్వేరుగా కలిశారు. రెండు దశాబ్దాలుగా ఎన్ఎస్ యూఐ నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నానని, తాత, తండ్రి కాలం నుంచి కాంగ్రెస్‌కు విధేయులమని తెలిపారు. విదేశాల్లో డాక్టర్ చదువు పూర్తి చేసుకుని స్వరాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు జైలు కెళ్లానని గుర్తుచేశారు. పార్టీలో తన సేవలను గుర్తించి ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సామాన్య కార్యకర్తలకు కూడా అగ్రనేతలను కలిసే అవకాశం కల్పించే గొప్ప పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. ప్రజాప్రతినిధులు సైతం తన పేరును సిఫారసు చేశారని వెల్లడించారు.
