- కలెక్టర్, తహసీల్దార్లు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సర్వే నెంబర్లు 194/1, 211కు సంబంధించిన భూమి యాజమాన్య వివాదం ఇంకా పరిష్కారం కాలేదని, అలాంటి పరిస్థితుల్లో కూల్చివేతలు ఎలా చేపట్టారంటూ హైడ్రా అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉండగానే కూల్చివేత చర్యలకు పాల్పడటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కూల్చివేతలకు కారణమైన ఆధారాలు, సంబంధిత పత్రాలతో ఈనెల 11న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్‌తోపాటు మల్కాజిగిరి, తిరుమలగిరి తహసీల్దార్లను ఆదేశించింది.
వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్‌లో కొనుగోలు చేసిన ప్లాట్ల వద్ద కాంపౌండ్ గోడలను ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా జులై 18న కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ పి.లింగారావు తదితరులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. రిజిస్టర్డ్ సేల్ డీడ్‌ల ఆధారంగా ప్లాట్లు కొనుగోలు చేశామని, 1990లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనుమతులు ఉన్నాయని వివరించారు.
రక్షణశాఖ కూడా ఈ భూమి తమ పరిధిలో లేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. అయితే, ఈ భూమి ప్రభుత్వానికి చెందిందంటూ రెవెన్యూ అధికారులు పేర్కొంటూ పనులను నిలిపివేయాలని సూచించారని తెలిపారు. కోర్టు హక్కుల వివాదం తేలేవరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, నోటీసు ఇవ్వకుండా కూల్చివేశారని పిటిషనర్లు వాదించారు. హైడ్రా తరఫు న్యాయవాది వాదిస్తూ.. ప్రైవేటు భూమిలో ఎలాంటి కూల్చివేతలు జరగలేదని వివరించారు. వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి 2006–07 వరకు ఈ భూమి పట్టా భూమిగానే నమోదు కాగా, 2014–15 రికార్డుల్లో మార్పులు చోటు చేసుకున్నాయని గమనించారు.
ఆ మార్పులకు స్పష్టమైన వివరణ లేకపోవడాన్ని ప్రశ్నించారు. మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ ఆ భూమిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం కోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. హక్కుల వివాదం పరిష్కారం కాకముందే అది ప్రభుత్వ భూమిగా ఎలా గుర్తించారో వివరించాలని కోర్టు ఆదేశించింది. పిటిషనర్ల భూమిని జీఎల్‌ఆర్ నెంబర్లు 243, 255తో ఎలా అనుసంధానం చేశారో రికార్డులతో సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్, మల్కాజిగిరి, తిరుమలగిరి తహసీల్దార్లు ఈనెల 11న జరిగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కూడా ధర్మాసనం ఆదేశించింది.
