బీసీల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకెళ్దాం..మంత్రి పొన్నం నివాసంలో బీసీ ప్రజాప్రతినిధుల భేటీ

బీసీల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకెళ్దాం..మంత్రి పొన్నం నివాసంలో  బీసీ ప్రజాప్రతినిధుల భేటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకెళ్లాలని బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిర్ణయించారు. శనివారం హైదరాబాద్‌‌లోని మినిస్టర్  క్వార్టర్స్‌‌లో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్  నివాసంలో బీసీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీకి ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఎంపీ అనీల్ కుమార్ యాదవ్, విప్‌‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, నవీన్ యాదవ్, రాజ్ ఠాకూర్ ప్రత్యక్షంగానూ.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ జూమ్ ద్వారా హాజరయ్యారు. ఈ నెల 14న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ పక్కన మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను.. 18న ట్యాంక్‌‌బండ్‌‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. 

ఈ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించాలని.. ఆయనకు బీసీల సమస్యలు వివరించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని తీర్మానించారు. రాష్ట్రంలో కులగణన చేపట్టినా బీసీల ఆకాంక్షలు పూర్తి స్థాయిలో నెరవేరలేదని అభిప్రాయపడిన నాయకులు.. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు, బీసీ కమిషన్ బలోపేతం, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిల విడుదల, బీసీ సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి నిధులు వంటి అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా డిస్కస్ చేశారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలోని బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.