హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందకు సనత్‌నగర్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్) సిద్ధమైందని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఈ మేరకు శనివారం హాస్పిటల్‌ను మంత్రి సందర్శించారు. ఏ, బీ, సీ బ్లాకులను పరిశీలించి వైద్య సేవలు, మౌలిక వసతులు, సిబ్బంది లభ్యత, భద్రత, ఫైర్ సేఫ్టీ వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న సీఎం లక్ష్యానికి అనుగుణంగా టిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామని, ఇక్కడ క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ వైద్యం, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ వంటి క్లిష్టమైన సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రారంభానికి ముందే మిగిలి ఉన్న అన్ని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, హాస్పిటల్ అందుబాటులోకి వచ్చిన మొదటి రోజు నుంచే రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలని ఆరోగ్యశాఖ, ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ప్రన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
