T20 World Cup: ఇంగ్లాండ్పై టీమిండియా గెలిచే ప్రసక్తి లేదు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

T20 World Cup: ఇంగ్లాండ్పై టీమిండియా గెలిచే ప్రసక్తి లేదు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా రేపు ( మార్చి 5న) భారత్‌తో జరిగే రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ విజయం సాధిస్తుందని ఆ జట్టు మాజీ క్రికెటర్ మైఖేల్ వాఘన్ జోస్యం చెప్పాడు. భారత్ కంటే ఇంగ్లాండ్ స్పిన్ డిపార్ట్మెంట్ బలంగా ఉంది, ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఫామ్‌లోకి వస్తే ఆ జట్టుకు తిరుగుండదని చెప్పుకొచ్చాడు. సూపర్–-8 దశలో ఇంగ్లీష్ టీమ్ మూడు మ్యాచ్‌లు ఆడి అన్నింట్లో గెలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. పాకిస్థాన్, న్యూజిలాండ్‌లపై విజయం సాధించడానికి బ్రుక్ సేన కాస్త కష్టపడింది. గ్రూప్ దశలో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్, నేపాల్‌పై తృటిలో ఓటమిని తప్పించుకుంది.

ఈ టోర్నీలో స్పిన్ పరంగా లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, విల్ జాక్స్ త్రయం అత్యుత్తమంగా నిలిచింది అని మాజీ ఇంగ్లాండ్ ప్లేయర్ మైఖేల్ వాఘన్ పేర్కొన్నాడు. ఈ ముగ్గురు ఇంగ్లాండ్‌కు గెలుపు మార్గాలు చూపగలరు అని తెలిపాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ ఫలితానికి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా, ఆ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పుకొచ్చాడు. ముంబైలో ఇంగ్లాండ్ గెలుస్తుందని తాను గట్టిగా నమ్ముతున్నానని అన్నాడు. ఇంగ్లాండ్ ఫీల్డింగ్ అత్యంత అప్రమత్తంగా ఉందని ప్రశంసించాడు. వికెట్ల మధ్య పరుగులు తీయడంలోనూ వారు మెరుగ్గా ఉన్నారు.. ఆటలో ప్రతి విషయాన్ని సమర్థంగా తమ జట్టు నిర్వహిస్తోందని మైఖేల్ వ్యాఖ్యానించాడు.

ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ నిలకడగా ఆడకపోవడం, ముఖ్యంగా జోస్ బట్లర్ ఫామ్ ఆందోళన కలిగిస్తోందని మైఖేల్ వాఘన్ అభిప్రాయపడ్డాడు. బట్లర్ ఎక్కువగా ఆలోచించకుండా తన సహజ ఆట ఆడాలి అని సూచించాడు. అతడు ఆడే ప్రతి బంతిని ఏకాగ్రతతో గమనిస్తూ రియాక్ట్ కావాలని సూచించాడు. అలాగే బట్లర్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే తరచుగా ఆడే ప్రత్యేక షాట్‌ను ఈ మధ్యకాలంలో ఆడడం లేదని చెప్పుకొచ్చాడు. వాంఖడే పిచ్ ఆ షాట్‌కు అనుకూలమని, సరైన ఏకాగ్రతతో ఆడితే అతనికి మంచి ఫలితం దక్కుతుందని మైఖేల్ వెల్లడించారు.