రాజ్యసభకు నితీశ్‌ కుమార్‌.. బీహార్‌ సీఎం పదవి నుంచి తప్పుకోనున్న నితీశ్‌.. నెక్ట్స్ సీఎం ఇతనేనా..?

రాజ్యసభకు నితీశ్‌ కుమార్‌.. బీహార్‌ సీఎం పదవి నుంచి తప్పుకోనున్న నితీశ్‌.. నెక్ట్స్ సీఎం ఇతనేనా..?

పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవి నుంచి తప్పుకుని రాజ్యసభకు వెళ్లాలని ఆయన నిర్ణయించారు. ప్రజల ఆదరాభిమానాలతో బీహార్‌కు రెండు దశాబ్దాలుగా సేవ చేసినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రజల్లోనే ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయాన్ని నితీష్ కుమార్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసి వెల్లడించారు.

బీహార్‌కు త్వరలో కొత్త ముఖ్యమంత్రి సేవలందించనున్నారు. బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నిర్ణయంతో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం నిజమైంది. నితీశ్​ రాజ్యసభకు వెళ్తారని.. ఆయన కొడుకు నిశాంత్​కుమార్ ​బిహార్ డిప్యూటీ సీఎం అవుతారని ఆ రాష్ట్రంలో జోరుగా చర్చ నడిచిన సంగతి తెలిసిందే. బిహార్ సీఎం రేసులో బీజేపీ సీనియర్ నేత, బీహార్ హోం మంత్రి సామ్రాట్ చౌదరి ఉన్నారు. బీజేపీ అధిష్టానం కూడా దాదాపుగా ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బీజేపీ నాయకుడికి సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని జాతీయ మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. గురువారం నితీశ్ రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. నితీశ్​కుమార్ కొడుకు నిశాంత్ ఇప్పటి వరకు రాజకీయాల్లో లేరు. అయితే ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారని జేడీయూ మంత్రులు కొద్ది రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. వాటిని నితీశ్, నిశాంత్, జేడీయూ ఖండించలేదు. 

75 ఏండ్ల నితీశ్ కుమార్ ఇప్పటి వరకు 10 సార్లు బిహార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 2015 నుంచి ఆయన బిహార్ సీఎంగా కొనసాగుతున్నారు. సైకిల్​, మద్య నిషేధం వంటి పథకాలతో ఆయన ప్రజల అభిమానం పొందారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. అయితే ముఖ్యమంత్రి మార్పు రాజ్యసభ ఎన్నికల తర్వాత ఉండొచ్చని తెలుస్తున్నది.