రైల్వేలో షాకింగ్ ఘటన: సర్జరీ అని చెప్పిన నమ్మలేదు.. విసిగిపోయిన లోకో పైలట్ చివరికి ఎం చేసాడంటే..

రైల్వేలో షాకింగ్ ఘటన: సర్జరీ అని చెప్పిన నమ్మలేదు.. విసిగిపోయిన లోకో పైలట్ చివరికి ఎం చేసాడంటే..

లక్నో రైల్వే డివిజన్‌లో ఓ షాకింగ్  ఘటన జరిగింది. ఆరోగ్యం బాలేదని, రెస్ట్ కావాలని చెప్పిన  నమ్మని పై అధికారికి నిజం నిరూపించడానికి, ఒక లోకో పైలట్ అందరి ముందే బట్టలు విప్పాల్సి వచ్చింది. ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు రైల్వే వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవ్వడమే కాకుండా, తోటి ఉద్యోగుల్లో  కోపాన్ని తెప్పించింది.

 ఎం జరిగిందంటే... ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (AILRSA) తెలిపిన వివరాల ప్రకారం.. రాజేష్ మీనా అనే లోకో పైలట్  పైల్స్  సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్ కోసం ఆయనకు ఫిబ్రవరి 22 నుండి 28 వరకు సెలవు ఇచ్చారు. అయితే సెలవు అయిపోయిన గాయాలు ఇంకా తగ్గలేదు. దీంతో సెలవు ఇంకొన్ని రోజులు ఇవ్వాలని  కోరారు. రైల్వే డాక్టర్లు కూడా ఆయన్ని పరీక్షించి, ఇంకా కొంచెం రెస్ట్ అవసరమని చెప్పారు. కానీ, సెలవు  ఇచ్చేందుకు  పై అధికారి నుంచి సిక్ మెమో తీసుకోవాలని సూచించారు.

 రాజేష్ మీనా  పై అధికారి అయిన రతన్ కుమార్‌ను కలిసి పరిస్థితి వివరించారు. తనకున్న సర్జరీ గాయాలు, వాడుతున్న మందులు, కట్టుకున్న బ్యాండేజీలు అన్నీ చూపించినా పై అధికారి నమ్మలేదు..  సిక్ మెమో ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎంత బ్రతిమలాడినా అధికారి వినకపోవడంతో, తీవ్రమైన అవమానానికి, అసహనానికి గురైన రాజేష్ మీనా.. సర్జరీ గాయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో నిరూపించడానికి అక్కడికక్కడే  ప్యాంటు విప్పి  చూపించారు. ఇదంతా అక్కడే ఉన్న తోటి సిబ్బంది వీడియో తీశారు.

యూనియన్ ఆగ్రహం
ఈ ఘటనను రైల్వే యూనియన్ లీడర్లు తీవ్రంగా ఖండించారు. రైళ్లను నడిపే లోకో పైలట్లు గంటల తరబడి కూర్చుని పనిచేయాలి. అలాంటి వారికి సర్జరీ తర్వాత కనీసం విశ్రాంతి కూడా ఇవ్వకుండా ఇలా అవమానించడం అమానుషం అని మండిపడ్డారు. ఈ గొడవ పెద్దదై యూనియన్ నేతలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, చివరికి రాజేష్ మీనాకు కోలుకోవడానికి మరికొన్ని రోజులు సెలవు ఇచ్చారు. అయితే ఈ ఘటనపై రైల్వే శాఖ నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది.