నగరంలో 'ల్యాండ్ మార్క్'గా వెలుగొందిన ఒక సుప్రసిద్ధ హోటల్ మూతపడటం, ఆ నష్టాలను, అప్పుల బాధను తట్టుకోలేక దాన్ని నడుపుతున్న కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం హృదయ విదారకమైన విషాదం. మన కళ్లెదుటే ఉన్న ఎన్నో స్థానిక కుటుంబాలను ఎలా రోడ్డున పడేస్తున్నాయో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఇది కేవలం ఒక కుటుంబం లేదా ఒక వ్యాపారానికి సంబంధించిన విషాదం కాదు. ‘సౌకర్యం’ పేరిట మనం అలవాటు చేసుకుంటున్న కొత్త విధానాలు, ఆన్‌లైన్ ఆర్డర్ల మోజులో, బడా సంస్థల మాయలోపడి మనం కోల్పోతున్నది ఏమిటో, ఎవరి పొట్టకొడుతున్నామో ఒక్కసారి విశ్లేషించుకుందాం.
మనం ఇంట్లో కూర్చుని ఆర్డర్ చేస్తున్నప్పుడు, అలాగే డిస్కౌంట్ల కోసం పరుగులు తీస్తున్నప్పుడు స్థానిక వ్యాపారులు ఎంతలా నష్టపోతున్నారో ఇటీవల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫుడ్ డెలివరీ యాప్‌లు హోటల్ యజమానుల నుంచి భారీ కమీషన్లు వసూలు చేస్తున్నాయి. దీనివల్ల చిన్న, మధ్యతరగతి రెస్టారెంట్లు కనీస లాభాలు లేక అప్పుల పాలవుతున్నాయి.
లక్షలాది చిన్న దుకాణాలకు ముప్పు
నిమిషాల్లో సరుకులు తెచ్చిచ్చే యాప్‌లతో పాటు, ఊరికి నలుమూలలా వెలుస్తున్న భారీ సూపర్ మార్కెట్ చైన్ల దెబ్బకు స్థానిక కిరాణా దుకాణాల వ్యాపారం 25% వరకు పడిపోయిందని అంచనా. ఆన్‌లైన్ సంస్థలు, బడా రిటైల్ ఫ్రాంచైజీల గుత్తాధిపత్యం వల్ల రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా లక్షలాది చిన్న దుకాణాలు శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉందని వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఒకప్పుడు వారాంతంలో కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లడం ఒక వేడుక. ఆ ప్రయాణంలో నలుగురితో కలవడం, మాట్లాడుకోవడం జరిగేది. దానికితోడు కాస్త నడవడం వల్ల శరీరానికి కనీస వ్యాయామం అందేది. కానీ, ఇప్పుడు ఆన్‌లైన్ యాప్‌ల పుణ్యమా అని అందరూ సోఫాలకు అతుక్కుపోయి ఒంటరిగా తింటున్నారు. దీనివల్ల మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. శారీరక శ్రమలేక ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.
క్లౌడ్ కిచెన్స్
మనం నేరుగా రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణం, వంటగది ఎంత పరిశుభ్రంగా ఉందో కళ్లతో చూడవచ్చు. వండిన వెంటనే వేడివేడిగా, తాజాగా ప్లేట్‌లోకి వచ్చే ఆహారం రుచే వేరు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినప్పుడు, ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాక్ చేసిన, ట్రాఫిక్‌లో ప్రయాణించి వచ్చే ఆహారం అప్పటికే తాజాదనాన్ని కోల్పోతుంది. అలాగే కేవలం ఆన్‌లైన్ ఆర్డర్ల కోసమే నడిపే ‘క్లౌడ్ కిచెన్స్’లో పరిశుభ్రత ఎలా ఉందో మనకు ఏమాత్రం తెలియదు. మనకు అలవాటైన ప్రామాణిక రుచులు కూడా మాయమైపోతున్నాయి. డెలివరీ యాప్‌లే కాదు, నగరాల్లో ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్న భారీ సూపర్ మార్కెట్లు, బడా రిటైల్ ఫ్రాంచైజీలు కూడా స్థానిక కిరాణా వ్యాపారుల పాలిట శాపంగా మారాయి.
టోకున సరుకులు కొని భారీ డిస్కౌంట్లతో అమ్మే ఈ బడాసంస్థల దెబ్బకు తట్టుకోలేక ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న చిన్న దుకాణాలను మూసుకుంటున్నారు. ఒకప్పుడు కిరాణా షాపు యజమాని మన కుటుంబంలో ఒకడిలా ఉండేవాడు. మనకు ఏం కావాలో ముందే తెలిసేది, కష్టకాలంలో అరువు కూడా ఇచ్చి ఆదుకునేవాడు. కానీ, ఇప్పుడు డిస్కౌంట్ల పేరుతో పెద్ద సంస్థలు ఈ చిన్న వ్యాపారుల పొట్టకొడుతున్నాయి. పాత పరిచయాలు, ఆత్మీయతలు మాయమైపోతున్నాయి.
గిగ్‌వర్కర్లకు భద్రత కరువు
ఆలిండియా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ తాజా నివేదిక ప్రకారం, కేవలం గత ఏడాది కాలంలోనే దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల కిరాణా దుకాణాలు మూతపడ్డాయి. ఒక్కో దుకాణం వెనుక యజమాని, గుమస్తాలు, ఇలా సగటున ముగ్గురు ఉపాధి కోల్పోయినా దాదాపు లక్షలాది మంది రోడ్డున పడ్డట్లే. ఆన్‌లైన్ యాప్‌ల వల్ల డెలివరీ బాయ్స్ (గిగ్ వర్కర్లు) రూపంలో కొందరికి ఉపాధి దొరుకుతోందన్న మాట వాస్తవమే.
కానీ... ఈ 'గిగ్ ఎకానమీ' ఉద్యోగాల్లో ఎలాంటి ఉద్యోగ భద్రత, కనీస ఆరోగ్య బీమా ఉండవు. మార్కెటింగ్ వ్యూహాల వల్ల ప్రాణాలకు తెగించి వాహనం నడుపుతూ వారు ప్రమాదాలకు గురువుతున్నారు. దశాబ్దాలుగా స్థిరమైన ఆదాయం, గౌరవం, సామాజిక భద్రత ఇచ్చిన సంప్రదాయ వ్యాపారాలు మూతపడటం వల్ల జరుగుతున్న భారీ ఉపాధి నష్టంతో పోలిస్తే... ఏ గ్యారెంటీ లేని ఈ తాత్కాలిక 'గిగ్' ఉపాధి ఏమాత్రం సరితూగదు. ఇది స్వయం ఉపాధితో బతికే లక్షలాది మందిని, కేవలం యాప్ కంపెనీల చేతిలో దినసరి కూలీలుగా మార్చేస్తోంది.
స్థానిక వ్యాపారులకు అండగా నిలుద్దాం
మొదట్లో ఆన్‌లైన్ సంస్థలు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఇచ్చి ఆకర్షిస్తాయి. ఇది కేవలం స్థానిక వ్యాపారులను దెబ్బతీసి, మార్కెట్‌ను తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి వేసే ఎత్తుగడ మాత్రమే. ఒకసారి వీధిలో ఉన్న దుకాణాలు, హోటళ్లు అన్నీ మూతపడ్డాక, ఈ యాప్‌లు ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచుతాయి, డెలివరీ ఛార్జీలు వడ్డిస్తాయి. అప్పుడు ప్రశ్నించడానికి, ప్రత్యామ్నాయంగా వెళ్లడానికి ఏ దారీ ఉండదు. కార్పొరేట్ సంస్థలు ఇచ్చే తాత్కాలిక డిస్కౌంట్లు, సౌకర్యం పేరిట దశాబ్దాలుగా మనకు సేవలందిస్తున్న స్థానిక వ్యాపారాలను మనం ఆదరించాలి.
కనీసం వారానికోసారైనా కుటుంబంతో కలిసి స్థానికంగా ఉండే హోటల్‌కు వెళ్లి భోజనం చేద్దాం. ఇంట్లోకి కావాల్సిన సరుకులను వీధిలోని కిరాణాషాపులోనే కొనుగోలు చేద్దాం. భారీ ఫ్రాంచైజీల మాయలో పడకుండా స్థానిక వ్యాపారులకు అండగా నిలుద్దాం. ఇంట్లోనే మనకు మనం బందీలుగా మారడం మానేసి, బయట ప్రపంచంతో కలుస్తూ మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. స్థానిక వ్యాపారులను బ్రతికించుకోవడం అంటే మనల్ని మనం, మన స్థానిక ఆర్థికవ్యవస్థను బ్రతికించుకోవడమే అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి!
- శ్రీనివాస్ మాధవ్,
‘51A అభీ ఫౌండేషన్’
వ్యవస్థాపక సభ్యుడు
Note:
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
