TCS, Infosys, Wiproలో విపరీతంగా పెరిగిన ఏఐ వాడకం.. 6 నెలల్లో కోపైలట్ లైసెన్సులు డబుల్

TCS, Infosys, Wiproలో విపరీతంగా పెరిగిన ఏఐ వాడకం.. 6 నెలల్లో కోపైలట్ లైసెన్సులు డబుల్

దేశంలోని టాప్ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో.. ఏఐ వాడకంలో ప్రపంచంలోనే అతిపెద్ద రికార్డు సృష్టించాయి. ఈ 3 కంపెనీలు తమ రోజువారీ కార్యకలాపాల కోసం 'మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్' ఏఐ టూల్ వాడకాన్ని భారీగా పెంచాయి. ఒక్కో కంపెనీ లక్షకు పైగా ఉద్యోగులకు ఈ ఏఐ టూల్ అందించటంతో 6 నెలల్లోనే మొత్తం లైసెన్సుల సంఖ్య 3 లక్షల మార్కును దాటేసింది. ప్రపంచంలోనే అత్యంత భారీ ఎంటర్‌ప్రైజ్ ఏఐ విస్తరణల్లో ఒకటిగా దీనిని మైక్రోసాఫ్ట్ చూస్తోంది. 

గత ఏడాది కేవలం 50వేల లైసెన్సులతో ప్రారంభమైన ఈ ప్రయాణం.. 6 నెలల్లోనే రెట్టింపు కావడం విశేషం. ఇది కేవలం సాఫ్ట్‌వేర్ కొనుగోలు నిర్ణయం కాదని.. ఏఐ ద్వారా కంపెనీలు పొందుతున్న అసలైన వ్యాపార విలువకు నిదర్శనమని మైక్రోసాఫ్ట్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అంటున్నారు. కేవలం ప్రయోగాలు చేసే దశ దాటి.. ఏఐ టూల్స్ ఇప్పుడు ఐటీ ఉద్యోగుల రోజువారీ పనిలో అంతర్భాగంగా మారిపోయాయని చెప్పారు.

ఈ 3 కంపెనీల్లో ఏఐ వాడకం అసాధారణంగా ఉంది. ఇన్ఫోసిస్‌లో 91 శాతం మంది, విప్రోలో 95 శాతం మంది ప్రతి నెల ఈ కోపైలట్‌ను వాడుతుండగా.. టీసీఎస్‌లో 86 శాతం మంది ఉద్యోగులు రోజూ దీనిని ఉపయోగిస్తున్నారట. విప్రో ఉద్యోగులు సొంతంగా 26వేలకు పైగా ఏఐ ఏజెంట్లను తయారు చేసుకున్నారు. ఈ ఏఐ వాడకం వల్ల టీసీఎస్ పరిశోధన, కంటెంట్ విభాగాల్లో ఉత్పాదకత 20 నుండి 25 శాతం పెరిగిందని తేలింది. అలాగే ఏదైనా విషయంపై రీసెర్చ్ చేయడం రెండు రెట్లు వేగవంతమైంది.

ఏఐ రాకతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పనితీరు కూడా మారుతోంది. రొటీన్ కోడింగ్, టెస్టింగ్, డాక్యుమెంటేషన్ పనులను ఏఐ చూసుకుంటుండటంతో.. హ్యూమన్ టాలెంట్ ఇప్పుడు ఆర్కిటెక్చర్, సిస్టమ్ డిజైన్, సెక్యూరిటీ వంటి అత్యంత విలువైన పనులపై ఫోకస్ పెడుతోంది. గ్లోబల్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ ప్రకారం.. 58 శాతం మంది వినియోగదారులు ఏడాది క్రితం తాము చేయలేని క్లిష్టమైన పనులను ఇప్పుడు ఏఐ సహాయంతో ఈజీగానే చేయగలుగుతున్నారని తేలింది.

ALSO READ : ఈసారి 30వేల మందిని పీకేస్తున్న ఒరాకిల్..

మన దేశంలో పెరుగుతున్న ఈ ఏఐ డిమాండ్‌కు అనుగుణంగా మైక్రోసాఫ్ట్ దేశంలో క్లౌడ్, ఏఐ మౌలిక వసతుల విస్తరణ కోసం నాలుగేళ్లలో దాదాపు రూ.లక్షా 50వేల కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో హైదరాబాద్‌లో సరికొత్త డేటా సెంటర్ రీజియన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే దేశంలో 2 కోట్ల మంది ప్రజలకు, 20 లక్షల మంది ఉపాధ్యాయులకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందట.