ఈసారి 30వేల మందిని పీకేస్తున్న ఒరాకిల్.. టెక్కీలకు అదే ఆఖరి వర్కింగ్ డే!

ఈసారి 30వేల మందిని పీకేస్తున్న ఒరాకిల్.. టెక్కీలకు అదే ఆఖరి వర్కింగ్ డే!

బీభత్సమైన లాభాలు వస్తున్నప్పటికీ ఉద్యోగులను తొలగించే విషయంలో అస్సలు తగ్గేదే లే అంటోంది ఒరాకిల్. అమెరికాకు చెందిన ఈ టెక్ దిగ్గజం కొన్ని నెలల కిందట వేల సంఖ్యలో ఉద్యోగులను లేఆఫ్ చేసి ఆశ్చర్యానికి గురిచేయగా.. మళ్లీ అదే రూటులో వెళుతోంది. వ్యాపారం, ఆదాయం పెరుగుతున్నప్పటికీ ఏఐ కోసం ఉద్యోగులను బలివ్వక తప్పని పరిస్థితిలో కంపెనీ ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సారి ఎంత మందిని ఎప్పుడు లేఆఫ్ చేయబోతుందనే వివరాలు ఇవే..

ఒరాకిల్ కార్పొరేషన్ తన హిస్టరీలోనే అత్యంత భారీ లేఆఫ్స్ ప్రక్రియను ముగింపు దశకు తీసుకువచ్చింది. జూన్ 15 నాటికి వేలాది మంది ఉద్యోగులు సంస్థ నుంచి అధికారికంగా తప్పుకోనున్నారు. ఈ భారీ ఉద్వాసనల్లో భాగంగా ఒరాకిల్ తన ప్రపంచవ్యాప్త శ్రామిక శక్తిలో దాదాపు 18 శాతం.. అంటే సుమారు 30వేల మంది ఉద్యోగులను తొలగిస్తుండటం టెక్ పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

సాధారణంగా నష్టాల్లో ఉన్న కంపెనీలు ఉద్యోగులను తీసేస్తుంటాయి. కానీ ఒరాకిల్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో అద్భుతమైన వృద్ధిని, భారీ లాభాలను నమోదు చేస్తున్నప్పటికీ ఈ స్థాయిలో లేఆఫ్స్ కొనసాగించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 22 శాతం పెరిగి 17.2 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో క్లౌడ్ ఆదాయం 44 శాతం వృద్ధితో 8.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ముఖ్యంగా ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏఐ విభాగం ఏకంగా 243 శాతం, మల్టీక్లౌడ్ డేటాబేస్ విభాగం 531 శాతం అసాధారణ గ్రోత్ సాధించాయి.

ఇంతటి అద్భుత ఆర్థిక ఫలితాలు ఉన్నప్పటికీ కంపెనీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక బలమైన వ్యూహం ఉంది. ఒరాకిల్ మేనేజ్‌మెంట్ ఇప్పుడు హ్యూమన్ లేబర్ కంటే ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులకే అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అందుకోసం 2026 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 50 బిలియన్ డాలర్లను ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక వసతుల విస్తరణకు కేటాయించింది. ఓపెన్ఏఐ, సాఫ్ట్‌బ్యాంక్ మద్దతుతో నడుస్తున్న ప్రతిష్టాత్మక స్టార్‌గేట్ ఏఐ ప్రాజెక్ట్‌లో కూడా ఒరాకిల్ కీలక భాగస్వామిగా ఉంది.

ఉద్యోగాలు కోల్పోతున్న టెక్కీలకు మాత్రం ఈ పరిణామం తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. ఒరాకిల్ అందిస్తున్న సెవెరెన్స్ ప్యాకేజీ గరిష్టంగా 26 వారాల వేతనంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలో ఇంకా మెచ్యూర్ కాని స్టాక్ అవార్డులను ఉద్యోగులు కోల్పోవాల్సి రావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నష్టపరిహార నిబంధనలను మార్చాలని ఉద్యోగులు పిటిషన్ వేసినప్పటికీ ఒరాకిల్ యాజమాన్యం అందుకు నిరాకరించింది. భవిష్యత్తులో రాబోయే బిలియన్ డాలర్ల ఏఐ వ్యాపారం కోసం ఒరాకిల్ తన పాత సిబ్బందిని ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలించుకుంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.