ఈ మధ్య కాలంలో ఒక విపరీత ధోరణి కనిపిస్తోంది. అదే స్వీయ వైద్యం లేదా ఓవర్ ది కౌంటర్ మందుల విచ్చలవిడి వాడకం. జ్వరం వచ్చినా, దగ్గు వేధించినా, ఒంట్లో కాస్త నలతగా ఉన్నా సరే వెంటనే డాక్టర్‌ను సంప్రదించకుండా పక్కనే ఉన్న మెడికల్ షాపుకు వెళ్లి అక్కడ ఇచ్చే ఏవో కొన్ని మాత్రలు వేసుకోవడం మన దగ్గర చాలా సాధారణం అయిపోయింది. కానీ, ఈ చిన్న పొరపాటు మన ఆరోగ్యాన్ని, మన భవిష్యత్తును ఎంతటి ప్రమాదంలో ముంచుతుందో ఎవరూ సరిగ్గా ఆలోచించడం లేదు.
వైద్యశాస్త్రం అనేది ప్రాణాలను కాపాడటానికి పుట్టిందే తప్ప ప్రాణాలతో వ్యాపారం చేయడానికి కాదు. అయితే, ఈ విపరీత ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో చిన్నపాటి ఇన్ఫెక్షన్ వచ్చినా ప్రాణాలు కోల్పోయేంత ప్రమాదం పొంచి ఉంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ విషయంలో వ్యాపార దృక్పథం కంటే మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మెడికల్ షాపులు అనేవి వ్యాపార కేంద్రాలే కావచ్చు. కానీ అవి సాధారణ కిరాణా కొట్టులు మాత్రం కావు. ప్రతి టాబ్లెట్ వెనుక ఒక శాస్త్రీయత ఉంటుంది.
ఒక నిర్దిష్టమైన మోతాదు ఉంటుంది. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రొటోకాల్స్ ప్రకారం షెడ్యూల్ హెచ్ అలాగే షెడ్యూల్ హెచ్-1 డ్రగ్స్ కచ్చితంగా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. భారతదేశంలో మందుల విక్రయ నియంత్రణ కోసం షెడ్యూల్ హెచ్, షెడ్యూల్ హెచ్-1 నిబంధనలు ఉన్నాయి. షెడ్యూల్ హెచ్ మందులను కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే విక్రయించాలి. వీటి ప్యాకింగ్‌పై 'Rx' గుర్తు ఉంటుంది.
షెడ్యూల్ హెచ్-1 అనేది మరింత కఠినమైన వర్గం. ఇందులో శక్తిమంతమైన యాంటీబయాటిక్స్, అలవాటుగా మారే మందులు ఉంటాయి. వీటిపై ఎరుపు రంగులో 'Rx' గుర్తు ఉంటుంది. ఫార్మసిస్ట్‌లు రోగి, డాక్టర్ వివరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో 3ఏళ్ల పాటు భద్రపరచాలి. షెడ్యూల్ ఎక్స్ కింద అత్యంత ప్రమాదకరమైన మత్తు, మానసిక స్థితిని ప్రభావితం చేసే మందులు ఉంటాయి. వీటిపై 'XRx' గుర్తు ఉంటుంది. దుర్వినియోగం కాకుండా అమ్మకపు రికార్డులను ఫార్మసిస్ట్‌లు రెండేళ్ల పాటు భద్రపరచాలి.
ప్రిస్క్రిప్షన్ లేకుండానే..
మందులను కేవలం లాభాల కోసం చాలా మెడికల్ షాపులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే రోగులకు ఇచ్చేస్తున్నాయి. డాక్టర్ దగ్గరకు వెళ్తే డబ్బులు వృథా అవుతాయనే ఒక అపోహను రోగులలో కలిగిస్తూ వారు తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇది కేవలం అనైతికం మాత్రమే కాదు, దీనిని ఒక మెడికల్ క్రైమ్‌గా పరిగణించాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల రోగికి ఆ క్షణానికి ఉపశమనం కలిగినట్లు అనిపించినా దీర్ఘకాలంలో శరీరంలో ఉండే బ్యాక్టీరియా ఆ మందులకు అలవాటు పడిపోయి సూపర్ బగ్స్ లాగ తయారవుతాయి. రోగి ప్రాణం కంటే గల్లా పెట్టె నిండటమే ముఖ్యం అనుకునే ధోరణి మారాలి.
యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనే కాలసర్పం
యాంటీబయాటిక్స్ అనేవి మనిషి ప్రాణాలను కాపాడే అస్త్రాలు. కానీ వాటిని అవసరం లేకుండా వాడినా లేదా తక్కువ మోతాదులో వాడినా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే తీవ్రమైన సమస్య తలెత్తుతుంది. దీనివల్ల భవిష్యత్తులో మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు సాధారణంగా పనిచేయాల్సిన మందులు ఏవీ పని చేయవు. సాధారణంగా వచ్చే వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ అవసరం అస్సలు ఉండదు. కానీ, తొందరగా తగ్గాలనే అపోహతో మెడికల్ షాపులు అధిక మోతాదు మందులు ఇస్తున్నాయి. దీని వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది. స్వీయ వైద్యం వల్ల లివర్ అలాగే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ వంటి మందులను విచ్చలవిడిగా వాడటం వల్ల అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు..
వైద్యరంగంలో పారదర్శకత తీసుకురావడానికి భారత అత్యున్నత న్యాయస్థానం అలాగే నేషనల్ మెడికల్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు కచ్చితంగా పెద్ద అక్షరాలలోనే రాయాలి. అలాగే మందుల బ్రాండ్ పేర్లతో పాటు జెనెరిక్ పేర్లనే వాడాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనివల్ల రోగికి తక్కువ ధరలో మందులు లభిస్తాయి. మెడికల్ షాపుల గుత్తాధిపత్యం తగ్గడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మే షాపుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చట్టం స్పష్టంగా చెబుతోంది. కానీ, నేటి కాలంలో చట్టాలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడం వల్ల మెడికల్ షాపులు తమ ఇష్టానుసారంగా మందులను అమ్ముతున్నాయి.
ప్రిస్క్రిప్షన్ లేని మందులు ప్రాణ సంకటం
ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం డాక్టర్లు మాత్రమే కాదు, ప్రజలలోనూ అవగాహన పెరగాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అడగటం అనేది మన జీవితంతో మనమే చెలగాటం ఆడటం లాంటిది. తక్కువ ఖర్చుతో వైద్యం అయిపోతుందనే భ్రమలో ఉండి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. మెడికల్ షాపులు తమ వృత్తి ధర్మాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. లాభం కంటే రోగి ప్రాణం చాలా విలువైనది. డ్రగ్ కంట్రోల్ అధికారులు తమ తనిఖీలను ముమ్మరం చేయాలి. నిబంధనలు అతిక్రమించే షాపుల లైసెన్స్‌లను తక్షణమే రద్దు చేయాలి.
ప్రిస్క్రిప్షన్ లేనిదే మందులు ఇవ్వకూడదనే నియమాన్ని ప్రతి మెడికల్ షాపు దగ్గర బోర్డు మీద ప్రదర్శించాలి. వైద్యం అనేది సేవా దృక్పథంతో కూడిన వృత్తి అని ప్రతి ఒక్కరూ భావించినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. యాంటీబయాటిక్స్‌ను చాక్లెట్లలా అమ్ముతూ మన భవిష్యత్తు తరాలను మందులు పనిచేయని లోకంలోకి నెట్టకండి. వచ్చేసారి మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుకు వెళ్లినప్పుడు ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మీరు కొనేది మందు కాదు ఒక నిశ్శబ్ద విషం అని గ్రహించండి. డాక్టర్‌ను సంప్రదించి సరైన వైద్యం తీసుకోవడమే ఉత్తమం.
డా.కట్కూరి,సైబర్ సెక్యురిటీ & న్యాయ నిపుణుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
