వెలుగు ఓపెన్ పేజీ.. సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత ఏది?

వెలుగు ఓపెన్ పేజీ.. సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత ఏది?

తెలంగాణ రాష్ట్ర  పదమూడో అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా  ప్రారంభమయ్యాయి.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్​కార్డులు అందజేయాలని  నిర్ణయించడం అభినందనీయం.దాదాపు 17 లక్షల మందికి  నగదు రహిత  వైద్యం అందించడం కోసం ఎంప్లాయ్ హెల్త్​కేర్  ట్రస్ట్'  ఏర్పాటు చేయడం  విద్య,  వైద్య రంగాల్లో  సరికొత్త   సంస్కరణలకు నాంది.  

అయితే,  ఇంతటి బృహత్తర పథకంలో  కాంట్రిబ్యూటరీ  పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కింద  పదవీ విరమణ  పొందినవారు  ఒక  అదృశ్య సమస్యగా  మిగిలిపోవడం వారి జీవితాలు చీకటి అంచున కొట్టుమిట్టాడడం విచారకరం. సాంకేతిక కారణాల పేరుతో వారిని ఈ పథకానికి  దూరం చేయడం,  వారి ఆశలను అడియాసలు చేయడమే!  ప్రభుత్వ  ప్రతిపాదన ప్రకారం,  హెల్త్​కార్డుల  నిర్వహణ  కోసం  పెన్షనర్ల  మూల పింఛను  నుంచి 1.5 శాతం  చందాను  మినహాయించాలి.  

పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)  పరిధిలోని  పెన్షనర్లకు  ప్రభుత్వం  నేరుగా  ట్రెజరీ ద్వారా పింఛను ఇస్తుంది కాబట్టి,  వారి నుంచి చందా వసూలు చేయడం ఒక చిన్న సాఫ్ట్‌‌వేర్ పని.  కానీ,   సీపీఎస్  ఉద్యోగుల పరిస్థితి ఇక్కడ భిన్నంగా ఉంది. వీరు రిటైర్ అయిన తర్వాత  ప్రభుత్వ  ట్రెజరీతో  వీరికి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఉండవు.  వీరికి  ట్రెజరీ పెన్షనర్ ఐడీ (పీపీఓ) ఉండదు.  వీరి పింఛను  ప్రైవేట్ యాన్యుటీ కంపెనీల నుంచి అందుతుంది.  ప్రభుత్వం  చెల్లించే  పెన్షన్ కానందున,  వారి ఖాతా  నుంచి  నేరుగా 1.5 శాతం  డబ్బును  ప్రభుత్వం ఎలా కట్ చేస్తుంది?  అన్నదే  ఇప్పుడు ఆర్థికశాఖ ముందున్న పెద్ద ప్రశ్న.

అభద్రతా భావంలో  పెన్షనర్లు 

ఓపీఎస్  పెన్షనర్లకు  నెలకు వేల రూపాయల పెన్షన్,  డీఏలు అందుతాయి.  కానీ  సీపీఎస్  కింద  రిటైర్ అయిన 2,300 మందికి పైగా ఉద్యోగుల పరిస్థితి  దయనీయంగా ఉంది.  మార్కెట్ షేర్ల  విలువపై  ఆధారపడి వీరికి వచ్చేది అరకొర  పింఛను మాత్రమే.  ఆ అరకొర డబ్బుతో  నిత్యావసరాలు కొనడమే గగనమైన వేళ,  వృద్ధాప్యంలో వచ్చే గుండె జబ్బులు,  క్యాన్సర్ వంటి  ప్రాణాంతక  వ్యాధులకు  వైద్యం చేయించుకునే  స్తోమత వీరికి ఎక్కడిది?  ప్రైవేట్ ఇన్సూరెన్స్  కంపెనీల  ప్రీమియంలు  భరించే శక్తి  వీరికి  అస్సలు లేదు. అందుకే  ఈ  డిజిటల్  హెల్త్​కార్డుల పథకం  వీరి పాలిట  ప్రాణవాయువు వంటిది.  

సాంకేతిక  కారణాలు చూపి  వీరిని  ఈ పథకం  నుంచి  దూరం పెడితే,  అది  వారు  చేసిన పాపం కాదు.   వ్యవస్థాపరమైన  వైఫల్యమే అవుతుంది.  ఈ నేపథ్యంలో  ప్రాన్ ఆధారిత నమోదే మేలు. ఈ  చిక్కుముడిని  విప్పడానికి  సీపీఎస్  యూనియన్​గా  ప్రభుత్వానికి  ఇప్పటికే  ఒక సూచన చేశారు.  సీపీఎస్  పెన్షనర్లకు  ట్రెజరీ ఐడీలు  లేకపోయినా,  వారి  దగ్గర  శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య  ప్రాన్  ఉంటుంది.  ఈ  ప్రాన్ నెంబర్ ఆధారంగా  ఐఎఫ్ఎంఐఎస్  పోర్టల్‌‌లో  వారి వివరాలను  నమోదు చేసుకునేలా సాఫ్ట్‌‌వేర్ మార్పులు చేయాలి. 

ఇప్పటికే 10%  సామాజిక భద్రత కోసం అదనంగా ఇప్పుడు 1.5% కోత

సీపీఎస్ ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి  ఇప్పటికే  అగమ్య గోచరంగా ఉంది. తమ వృద్ధాప్య  భరోసా  కోసం  ఇప్పటికే  ప్రతి నెలా తమ వేతనంలోంచి 10 శాతం  వాటాను  కంట్రిబ్యూటరీ  పెన్షన్ స్కీం కోసం చెల్లిస్తూ,   భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనతో  కాలం  వెళ్లదీస్తున్నారు.  అటువంటిది,  ఇప్పుడు  ఆరోగ్య భద్రత  పేరుతో అదనంగా మరో 1.5 శాతం చందాను  చెల్లించమనడం వారిపై అదనపు భారాన్ని మోపడమే అవుతుంది.  అరకొర  పింఛనుతో ఉనికి కోసం పోరాడుతున్న  సీపీఎస్  పెన్షనర్లకు,  ఈ ఆర్థిక భారం గాయంపై  కారం చల్లినట్లుగా  మారుతోంది.  

కాబట్టి  ఎలాంటి  సామాజిక భద్రత లేని  వీరి  ఆరోగ్య బాధ్యతను  ప్రభుత్వమే ఒక సామాజిక సంక్షేమ చర్యగా స్వీకరించాలి.  పదవీ విరమణ  పొందిన  సీపీఎస్  సిబ్బందికి ఉచితంగానే  ఈ వైద్య సేవలు అందించడం న్యాయబద్ధం.  రైల్వే వంటి  కేంద్ర  ప్రభుత్వ విభాగాల్లో  ఒక నెల బేసిక్  పే  చెల్లిస్తే  జీవితకాలం  ఉచిత వైద్యం  అందించే పద్ధతి ఉంది.  

మన దగ్గర కూడా ఇలాంటి  సులభమైన  విధానాన్ని పరిశీలించాలి.  సీపీఎస్  ఉద్యోగుల  నుంచి 1.5%  చందాను ఏ విధంగా సేకరిస్తారో  స్పష్టమైన  విధివిధానాలను  వెల్లడించడంతోపాటు, ఉద్యోగులకు ఈ పథకంలో  చేరడానికి స్వచ్ఛంద ఎంపిక  అవకాశాన్ని  ప్రభుత్వం  కల్పించాలి. 

మానవీయ కోణమే ముఖ్యం

ఈ డిజిటల్  హెల్త్ కార్డులు అందరికీ అందాలనే  లక్ష్యం నెరవేరాలంటే,  ప్రభుత్వం  సీపీఎస్  పెన్షనర్ల  సమస్యను  మానవీయ కోణంలో చూడాలి.  ‘ఆరోగ్య తెలంగాణ’ అనేది  కేవలం  ఒక  నినాదం కాకుండా,  ప్రతి  విశ్రాంత ఉద్యోగికి  భరోసా  ఇచ్చే  నిశ్చయం కావాలి.  ఐఎఫ్ఎంఐఎస్  సాఫ్ట్‌‌వేర్‌‌ను  అప్‌‌గ్రేడ్ చేయడం,  వీరి వివరాలను  నమోదు చేయడం వంటివి  సాంకేతికంగా  పెద్ద పనులు కావు.  కావాల్సిందల్లా  ప్రభుత్వ చిత్తశుద్ధి  మాత్రమే.  ఆనాడు పోరాటంలో  పాల్గొన్న  తెలంగాణ బిడ్డలు,  ఈనాడు  వృద్ధాప్యంలో  వైద్యం అందక  అల్లాడకూడదు.  ప్రభుత్వం వెంటనే  స్పందించి  రిటైర్డ్  సీపీఎస్ ఉద్యోగులకు  సంపూర్ణ  ఆరోగ్య భద్రత కల్పించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందని ఆశిద్దాం.

గంగాపురం స్థితప్రజ్ఞ,రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సీపీఎస్​ ఎంప్లాయీస్ యూనియన్
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.