బస్తీ నుంచి భారత సైన్యం వరకు.... అలలను జయించి తలరాతలను మార్చుకున్న తెలంగాణ యువత సక్సెస్ స్టోరీ!

బస్తీ నుంచి భారత సైన్యం వరకు.... అలలను జయించి తలరాతలను మార్చుకున్న తెలంగాణ యువత సక్సెస్ స్టోరీ!

పట్టుదల, ఆత్మవిశ్వాసం, కఠోర శిక్షణ, సరైన మార్గదర్శకత్వం ఉంటే పేదరికం విజయానికి అడ్డుకాదని తెలంగాణ యువత నిరూపిస్తోంది. వికారాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్‌గా, గిరిజన యువతి తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా, బస్తీలో పెరిగిన బాలుడు ఇండియన్ నేవీ సెయిలింగ్ విభాగంలోకి, సిద్ధిపేటకు చెందిన బాలిక అంతర్జాతీయ సెయిలింగ్ స్టార్‌గా.. ఇలా మరెందరినో విజయతీరాలకు చేర్చింది ‘‘ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్’’. ఈ క్లబ్​లో చేరి.. అలలను జయించి.. తమ తలరాతలను మార్చుకున్న సెయిలింగ్ స్టార్స్ ఇన్​స్పైరింగ్​​ స్టోరీ. 

మద్రాస్ ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన హైదరాబాదీ సుహీం షేక్, ఐటీ ఉద్యోగానికి గుడ్ బై చెప్పి, 2009లో హుసేన్ సాగర్ దగ్గర సంజీవయ్య పార్కు కేంద్రంగా యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్​ను నెలకొల్పారు. శిథిలావస్థలో ఉన్న 60 ఏళ్ల నాటి జెట్టీని, మూడు చిన్న పడవలతో ఏర్పాటు చేసిన యాచ్ క్లబ్ ఇప్పుడు 210కి పైగా పడవలతో దేశంలోనే అతిపెద్ద సెయిలింగ్ ఫ్లీట్​గా, యువ సెయిలర్ల కేంద్రంగా మార్చారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చిన నిరుపేదలు, అనాథలు, గిరిజన యువతీ యువకులను సెయిలింగ్ క్రీడ ద్వారా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్లబ్ ద్వారా వాళ్లను ఉద్యోగాలు, జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడా విజయాల దిశగా నడిపిస్తున్నారు. 

నావికుడి నుంచి ఇండియన్ నేవీ దాకా.. 

పాటిగడ్డ బస్తీ బాలుడు మహమ్మద్ రిజ్వాన్ పలు పతకాలు సాధించి బెస్ట్ సెయిలర్​గా గతేడాది గోవాలోని ఇండియన్ నేవీ స్కూల్​కు ఎంపికయ్యాడు. నిరుపేద కుటుంబంలో పుట్టిన రిజ్వాన్​కు ఎనిమిదేండ్ల వయసు ఉన్నప్పుడు, కారు డ్రైవర్​గా పనిచేస్తున్న అతని తండ్రి చనిపోయాడు. దాంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆ వయసులో రిజ్వాన్ యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌లో చేరి సెయిలింగ్ శిక్షణ తీసుకున్నాడు. తనతోపాటు అతని తల్లికి ఈ ప్రాంగణంలోనే వంటమనిషిగా ఉద్యోగాన్ని క్లబ్ కల్పించింది. మూడేళ్లలోనే సెయిలింగ్​లో అసాధారణ ప్రతిభ కనబర్చిన రిజ్వాన్ రాష్ట్రస్థాయిలో కాంస్య పతకం సాధించి దేశంలో నెంబర్​ వన్ ర్యాంక్ ఆప్టిమిస్ట్ నావికుడిగా ఎదిగాడు. అతను యూకేలోని ప్లైమౌత్‌లో జరిగిన క్యాడెట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లతో సహా ఆరు అంతర్జాతీయ రెగట్టా పోటీల్లో మనదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. నాలుగు దేశాల్లో జరిగిన సెయిలింగ్ ఆరు రెగట్టాల్లో పాల్గొన్న రిజ్వాన్ సెయిలరుగా 29వ ర్యాంక్ సాధించాడు. సింగపూర్ యూత్ సెయిలింగ్ చాంపియన్‌షిప్ 2025, మలేషియా 21వ లాంగ్‌కావి ఇంటర్నేషనల్ రెగట్టా 2025, ఒమన్ ముసన్నా రేస్ వీక్ 2024, యూకే క్యాడెట్ బ్రిటిష్ నేషనల్స్ 2024  పోటీల్లో పాల్గొన్న రిజ్వాన్ ర్యాంకులు సాధించాడు. అంతర్జాతీయ పోటీల్లో కాకుండా తెలంగాణ, ఆసియా క్రీడల్లో 20కి పైగా జాతీయ, రాష్ట్రస్థాయి రెగట్టాలలో రిజ్వాన్ నిలకడగా అత్యుత్తమ 25 శాతం స్థానాల్లో టాప్ క్వార్టైల్​గా నిలిచాడు. ఇందులో13సార్లు పోడియం పతక విజేతగా, టాప్-10 స్థానాల్లో నిలిచాడు. 2025లో ఇతను గోవాలోని ప్రతిష్ఠాత్మక నేవీ బాయ్స్ స్కూల్‌లో సెయిలింగ్ కోటాలో చేరాడు. ప్రస్తుతం15 ఏళ్ల వయసులో రిజ్వాన్ నేవీ, ఒలింపిక్ స్థాయి సెయిలింగ్ కెరీర్ దిశగా పయనిస్తున్నాడు. 

వీరితోపాటు రాగి రజనీకాంత్, ఎస్.కె. రమీజా భాను, సూరగాని ఈశ్వా, బి. రవికుమార్, ప్రీతి కొంగర, రవళి పరండి, వైష్ణవి వీరవంశం, శ్రవణ్ కాట్రవత్, దుర్గాప్రసాద్, గౌతం కనకట్ల వంటి ఎంతోమంది సెయిలింగ్ ద్వారా ఉన్నతస్థాయికి చేరుకున్నారు. వీళ్లంతా సెయిలింగ్​ విన్నర్స్​ మాత్రమే కాదు.. షైనింగ్ స్టార్స్​ అని ప్రూవ్ చేశారు. 

సాగర్ లో సెయిలింగ్ సందడి


వర్షాకాలం రాకతో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుసేన్ సాగర్ కేంద్రంగా సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో సెయిలింగ్ పోటీలతో సందడి నెలకొంది. చల్లటి గాలి, అలలు, ప్రవాహాలను తట్టుకుంటూ పడవలను నడిపే ప్రక్రియను సెయిలింగ్ అంటారు. సెయిలింగ్ పోటీల్లో (రెగట్టాస్) వివిధ కేటగిరీల పడవలు పాల్గొంటాయి. పోటీదారులు అందరికంటే వేగంగా ముగింపు రేఖను దాటడానికి వ్యూహాత్మకంగా గాలి వేగాన్ని ఉపయోగించుకుంటూ పడవలను నడుపుతారు. సెయిలింగ్ పోటీల్లో భాగంగా ఫ్లీట్ రేసింగ్ పలు పడవలు ఒకేసారి పోటీపడతాయి. మ్యాచ్ రేసింగ్ కేవలం రెండు పడవల మధ్య మాత్రమే ఉంటుంది. జట్ల వారీగా నిర్వహించే పోటీలను టీమ్ రేసింగ్ అంటారు. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువులలో తరచుగా కయాకింగ్, నేషనల్ లెవెల్ సెయిలింగ్ పోటీలు జరుగుతుంటాయి. 

సిద్దిపేట సెయిలింగ్ స్టార్

సిద్దిపేట జిల్లాకు చెందిన కొమ్మరవెల్లి లహరి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. అనారోగ్యం వల్ల గత ఐదేళ్లుగా లహరి తండ్రి పని చేయలేకపోవడంతో, మొదట్లో ఇంటి బాధ్యత ఆమె తల్లి కవితపై పడింది. దీంతో కొవిడ్ సమయంలో ఆమె మొదట హాస్పిటల్‌లో హౌస్‌కీపింగ్ ఉద్యోగినిగా చేరింది. తన కుమార్తెకు మంచి భవిష్యత్ అందించాలనే లక్ష్యంతో కవిత ఆసుపత్రి ఉద్యోగాన్ని వదిలి ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌లో యువ నావికులకు వంటమనిషిగా చేరింది. అలా తన కుమార్తె లహరిని 11 ఏళ్లకే ఈ సెయిలింగ్ క్లబ్​లో చేర్పించింది. హైదరాబాద్13వ మాన్‌సూన్ రెగట్టా 2022 పోటీల్లో ఆప్టిమిస్ట్ గ్రీన్ ఫ్లీట్‌లో స్వర్ణ పతకం, మైసూరు యూత్ మల్టీక్లాస్ చాంపియన్‌షిప్ 2022లో ఆప్టిమిస్ట్ గ్రీన్ ఫ్లీట్‌లో స్వర్ణపతకం గెలిచింది. ముంబైలో జరిగిన ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్ I, II రెండింటిలోనూ మొదటి స్థానంలో నిలిచి, ఆసియా క్రీడలకు అర్హత సాధించింది. కోచ్ సుహీమ్ షేక్ మద్దతుతో19 జాతీయ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న లహరి ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలు, అయిదు అంతర్జాతీయ పతకాలు సాధించింది. సింగపూర్, మలేషియా, ఒమన్ దేశాల్లో జరిగి సెయిలింగ్ పోటీల్లో ఈమె రెండు అంతర్జాతీయ రజత పతకాలు సాధించి ప్రశంసలందుకుంది. 2024లో ఆమె ఒక ప్రమాదానికి గురవడం వల్ల యూకేలోని ప్లైమౌత్‌లో జరగాల్సిన తన మొదటి అంతర్జాతీయ అవకాశాన్ని ఆమె కోల్పోవలసి వచ్చినా, ఆమె కోలుకొని, తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఈమధ్య సాధించిన విజయంతో లహరి అసాధారణమైన మానసిక బలాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఆసియా క్రీడల్లో లహరి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుండటం దేశానికి గర్వకారణం. తమ కుటుంబ గడ్డు పరిస్థితులకు అతీతంగా కలలు కనే సాహసం చేసే లక్షలాది మంది పిల్లలకు లహరి కథ ఒక స్ఫూర్తి.


వికారాబాద్ టు ఇండియన్ ఆర్మీ..  

వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కొండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన వడ్ల మల్లేష్ పదేళ్ల వయసులో ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్​లో సెయిలింగ్ క్రీడల్లో శిక్షణ పొందడానికి ఎంపికయ్యాడు. గోవాలోని నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీలో సెయిలింగ్ శిక్షణ పొందాడు. హైదరాబాద్‌లో జరిగిన మాన్సూన్ రెగట్టా, సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా, క్లాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్, నార్త్ ఈస్ట్ రెగట్టా, గోవాలో జరిగిన75 నాట్స్ రెగట్టా, ఇండియా ఇంటర్నేషనల్ రెగట్టా పోటీల్లో నాలుగు గోల్డ్ మెడల్స్, రెండు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించి మల్టీ క్లాస్ సెయిలర్​గా గుర్తింపు పొందారు. నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీలో వడ్ల మల్లేష్ సాధించిన సెయిలింగ్ రికార్డుల ఆధారంగా 2024 సెప్టెంబర్ నెలలో స్పోర్ట్స్ కోటా కింద అగ్నివీర్​గా ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యారు. ఆర్మీలో పనిచేస్తూనే న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుంచి 11, 12వ తరగతులు పూర్తి చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బి.ఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హుసేన్ సాగర్ మీదుగా పడవ తెరచాప పైకి వెళ్లడాన్ని చూస్తున్న తెలంగాణ గ్రామాలకు చెందిన ప్రతి బాలుడికి మల్లేష్ కథ ఆదర్శంగా మారింది.

తండా నుంచి తెలంగాణ పోలీసు శాఖ వరకు.. 

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండతిమడుగు పరిధిలోని పెద్ద తండా అనే మారుమూల గిరిజన ప్రాంతానికి చెందింది తుంగర మహబూబీ. తండ్రి మరణం తర్వాత ఆమె తల్లి కళ కొంతకాలం కూలీ పనిచేసి పోషించింది. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమైంది. ఈమెకు ఒక చెల్లెలు ఉంది. తండ్రి మరణం, తల్లి సంపాదన లేకపోవడంతో, ఆ కుటుంబానికి పేదరికం నుంచి బయటపడే మార్గం కనిపించలేదు. అలాంటి సమయంలో 2015లో 11 ఏళ్ల వయసులో మహబూబీ ‘ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్’లో సెయిలింగ్ శిక్షణ ప్రారంభించింది.
గిరిజన బిడ్డ తుంగర మహబూబీ హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ స్టేట్ రెగట్టా 2017లో ‘ఆప్టిమిస్ట్’ బాలికల విభాగంలో రజత పతకం, చెన్నైలో జరిగిన 8వ ఇండియా ఇంటర్నేషనల్ రెగట్టాలో రేసింగ్ సర్టిఫికేట్ పొందింది. హైదరాబాద్‌లో మాన్సూన్ రెగట్టాలో కాంస్య పతకం, మాన్సూన్ రెగట్టాలో ముంబైలో జరిగిన జూనియర్ కోస్టల్ మల్టీక్లాస్ పోటీల్లో లేజర్ 4.7 కాంస్య పతకం సాధించింది. హుస్సేన్ సాగర్‌లో సెయిలింగ్ అనుభవం వల్ల పోలీసుశాఖలో ఉద్యోగం లభించింది. ఈమె ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. నేడు విధులను నిర్వర్తిస్తూనే, తనలాంటి నేపథ్యం ఉన్న బాలికలకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ సెయిలింగ్​తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.

 

చాంపియన్లను తయారుచేశాం 

మా క్లబ్​లో శిక్షణ పొందిన 19 మంది అబ్బాయిలు ఆర్మీ, నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీలలో ప్రవేశం పొందారు. 17 ఏళ్లలో మా క్లబ్ 90 మంది జాతీయ చాంపియన్‌లను తీర్చిదిద్దింది. మా విద్యార్థులు అంతర్జాతీయ పోటీదారులుగా మెడల్స్ సాధించారు. 182 ఇంటర్నేషనల్ ఈవెంట్లను సాయుధ దళాలు నడుపుతున్న శిక్షణా పాఠశాలల్లోకి 10 మంది విద్యార్థులను అందించింది. 
సెయిలింగ్ ద్వారా జీవితాలను మార్చడంలో మాతో చేరాలనుకుంటే.. మమ్మల్ని సంప్రదించడానికి +91 89779 41276కు ఫోన్ చేయండి. మా అడ్రస్ సంజీవయ్య పార్క్, హుస్సేన్ సాగర్ సరస్సు, హైదరాబాద్, తెలంగాణ. 

 సుహీం షేక్ హుసేన్, 
యాచ్ క్లబ్ వ్యవస్థాపకులు