మరో అవకాశాన్ని జారవిడుచుకోవద్దనే తెలివి పంజాబ్‌లో కాంగ్రెస్ ఆశల్ని నెరవేరుస్తుందా? లేక తీరు మారని ‘ముఠా వైరాల’ పాత పద్ధతి వారికి మళ్లీ నిరాశనే మిగిల్చేనా? ఇప్పుడిదే పంజాబ్ రాజకీయ చిత్రపటంలో కొట్టొచ్చినట్టు కనిపించే బొమ్మ. ఏడెనిమిది మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమౌతున్న పంజాబ్‌లో కాంగ్రెస్ గెలుపోటములే అక్కడ రాబోయే ప్రభుత్వాన్ని నిర్ణయిస్తాయి. ప్రభుత్వ వ్యతిరేకత అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని వేధిస్తున్నా రాజకీయంగా ఇప్పుడా పార్టీయే రాష్ట్రంలో బలంగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ముచేసుకొని తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పుష్కల అవకాశాలున్న కాంగ్రెస్ వాటిని ఒడిసిపట్టి ఆధిక్యత సాధిస్తుందా? విఫలమై, ఆప్ అధికారం నిలబెట్టుకోవాలనే యత్నాలకు పరోక్షంగా దోహదపడుతుందా? అన్నది కాంగ్రెస్ అంతర్గత ‘ఐక్యత’ మీద ఆధారపడి ఉంది. ఢిల్లీ సర్కారు పెత్తనంతో బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా, పునర్వైభవం కోసం శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడి) ఎంత యత్నించినా కొంత మెరుగవుతారేమో తప్ప, పంజాబ్ అధికార పీఠం దక్కించుకోవడం వారికి కష్టసాధ్యమే. అలా అని బీజేపీని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇదీ పంజాబ్‌లో తాజా స్థితి!
ఒకప్పటి తమ సురక్షిత కోట పంజాబ్‌లో రాజకీయంగా ‘రచ్చ’ గెలవాలంటే కాంగ్రెస్ ముందు ‘ఇంట’ గెలవాలి. పార్టీలో లుకలుకలు పోవాలి. బయటకు బాగున్నట్టే ఉంటూ, లోలోపల పరస్పరం
ద్వేషించుకునే రాష్ట్ర నాయకుల ‘ముఠా తగాదాల పర్వం’ ముగియాలి. పార్టీ అధిష్టానం చొరవ తీసుకొని మార్గదర్శకత్వాన్ని నిర్దేశించాలి. అప్పుడుగాని వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక గట్టి పోటీదారుగా నిలవజాలదు. సంస్థాగత ఐక్యతతోనే పాలక ఆప్ కి కాంగ్రెస్ గట్టి సవాల్ విసరగలుగుతంది. ఏమో! అదృష్టం బాగుండి అన్నీ కలిసొస్తే పంజాబ్‌లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చినా రావచ్చు. కానీ, ఇదివరకు రాజస్తాన్, మధ్యప్రదేశ్, హర్యానా, చత్తీస్‌గఢ్‌లలో చేసుకున్నట్టు పార్టీ అనైక్యత వల్లే ఉన్న అవకాశాల్ని చే‘జేతు’లా జారవిడుచుకుంటే ఇక్కడా మరో ఓటమి ఖాయం. ఎన్నికల పూర్వరంగాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ‘పీపుల్స్ పల్స్ ’ రీసెర్చ్ సంస్థ సర్వే ప్రతినిధులకు ఇప్పటికిప్పుడు కనపిస్తున్న పంజాబ్ ముఖచిత్రమిది!
చరిత్ర నెమరు వేస్తే సరిపోదు
ఒక రాష్ట్రంలో ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో పాగా వేసి సర్కారును ఏర్పరచడం భారత రాజకీయాల్లో అరుదు. అంతటి ఘనత ‘ఆప్’కు పంజాబ్‌లో దక్కింది. ఢిల్లీలో సంచలన విజయాలు నమోదు చేసిన ఆప్ 2022 ఎన్నికల్లో గెలిచి పంజాబ్‌లో గద్దెనెక్కింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారి, వారి రాజకీయ ఆటలో పలువురు ఎంపీలను కోల్పోయి ‘ఆప్’ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. డ్రగ్స్ నియంత్రణతోపాటు నిరుద్యోగం, విద్య, వైద్యం వంటి విషయాల్లో ఎన్నికల హామీలు నెరవేర్చలేదనే విమర్శలున్నాయి. వివాదాస్పద చట్టం ద్వారా సిక్కుల మనోభావాల్ని భంగపరిచారనే విమర్శను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎదుర్కొంటున్నారు. సిక్కు మతస్తుల అత్యున్నత సంస్థ ‘అకల్‌తక్త్’ సీఎం మాన్‌ను ‘గురు ద్రోహి’ (గురు దోఖి), ‘కల్సా పంథ్ విరోధి’ అని విమర్శిస్తోంది. ఈ అంశం ప్రస్తుతం ‘శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ’ (ఎస్‌జీపీసీ) పరిశీలనలో ఉంది. రాష్ట్రంలో అధిక సంఖ్యాకులైన సిక్కుల్లో వ్యతిరేకత బలపడితే అది ఆప్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టే అంశమే! దీన్ని అకాలీదళ్ మతపరంగా ఎత్తిచూపినా, బీజేపీ రాజకీయంగా ఎండగట్టినా.... ఆ రెండు పార్టీలు పాలకపక్షం ఆప్‌కు ప్రత్యామ్నాయం కాజాలవనే భావన సగటు పంజాబీల్లో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత బలపడితే దాన్ని రాజకీయంగా తన లబ్ధికి మళ్లించుకునే అవకాశాలు కాంగ్రెస్‌కే ఎక్కువ. పార్టీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి? అనే కొట్లాట ఇప్పట్నుంచే ఉంది. ఆప్ రంగప్రవేశం ముందు, బీజేపీ-, అకాలీదళ్ సంకీర్ణం వరకున్న ‘కాంగ్రెస్ వర్సెస్ అకాలీదళ్’ శకం ఎప్పుడో ముగిసింది. తాజా పరిస్థితికి తగ్గట్టు పార్టీలో ఐక్యత సాధించి, ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని కలిగించడం కాంగ్రెస్ ముందున్న కర్తవ్యం.
సంకేతాల్ని గ్రహిస్తేనే కొత్తదారి
2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన కాంగ్రెస్.. లోక్‌సభ (2024) ఎన్నికల నాటికి కాస్త పుంజుకుంది. సదరు సంకేతాల్ని పార్టీ నాయకత్వం గ్రహించాలి. అప్పటి ఓటమి, తదనంతర మెరుగుదల, రెంటి నుంచీ పాఠాలు నేర్చుకోవాలి. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ స్వయంకృతాపరాధమే! పార్టీలో సంస్థాగతమైన ముఠా తగాదాల్ని అధినాయకత్వం సమర్థంగా పరిష్కరించలేకపోయింది. నాటి సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్‌కు క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పార్టీ దుందుడుకు నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మధ్య స్పర్ధలు పెరిగేవరకు అధిష్టానం ఉపేక్షించింది. ఆ తర్వాత అది పరిష్కరించకుండా సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందర నిర్హేతుకంగా ముఖ్యమంత్రిని మార్చి దళితుల మద్దతు కోసం చరణ్‌జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిని చేసింది. ఆ ప్రభుత్వం ప్రజా విశ్వాసం చూరగొనలేదు. ఆయన తాను పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోయారు. 38.6 శాతం ఓట్ల (2017) నుంచి 23 శాతం ఓటు వాటాకు పడిపోయి, 117 స్థానాలున్న అసెంబ్లీలో 77 నుంచి 18 సీట్లకు కాంగ్రెస్ పరిమితమైంది. 20 సీట్ల నుంచి ఆప్ 95 స్థానాలకు ఎదిగి, ఏకంగా ఢిల్లీ బయట తొలి ప్రభుత్వాన్నే ఏర్పరచింది.
రాహుల్ చెప్పినా, కమిటీ వచ్చినా..
పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం పదవి ఆశించే సీనియర్ల జాబితా పెద్దదే! కానీ, పార్టీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించినట్టు ‘ఒకరికొకరు పూల బొకేలు ఇచ్చుకుంటూ, ముసిముసి నవ్యులు రువ్వుకుంటూ... లోపల మాత్రం పరస్పరం విచ్చుకత్తులు విసురుకునే తత్వం వల్ల ఒరిగేదేమీ లేదు, ప్రజాక్షేత్రంలో పార్టీ పలుచనవడం తప్ప’ అన్నది అక్షర సత్యం. పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల ఒక భేటీలో పంజాబ్ పార్టీ నాయకులనుద్దేశించి ‘మీరంతా ఐక్యతతో ఉండాలి, నాయకత్వం చూపే దారిలోకి రావాలి, ఉమ్మడిగా పోరాడాలి’ అని కాసింత కటువైన స్వరంతోనే చెప్పారు. అయినా వారెవరూ దాన్ని అంత తీవ్రంగా పరిగణించినట్టు లేదనడానికి తదనంతర పరిణామాలే తార్కాణం.
‘మహారాజా రంజిత్ సింగ్ (1849) కు జరిగిన విద్రోహం నుంచి ఇప్పటిదాకా పంజాబ్ సమస్యల్లా అంతర్గత వర్గపోరు, పరస్పర ద్రోహాలే’ అంటూ పార్టీ సీనియర్ ఎంపీ మనీష్ తివారీ (చండీఘర్) ‘ఎక్స్’ వేదికగా చేసిన వ్యాఖ్య పార్టీలో దుమారమే రేపింది. ప్రతాప్ సింగ్ భజ్వ, చన్నీ, రాజావారింగ్, సుఖ్‌పాల్ ఖైరా, సుఖ్జిందర్ రందావా, గుర్జీత్‌సింగ్, విజయ్ ఇందల్ సింగ్లా... ఇలా ఎందరెందరో సీనియర్లు పార్టీలో తలొక దారి అన్నట్టు వ్యవహరించడం అధిష్టానానికి తలనొప్పిగా ఉంది. పీసీసీ ప్రస్తుత నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు నేతలు అధిష్టానం సూచనలు, సలహాలను కూడా పెడచెవిన పెడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల సీనియర్లు అజయ్ మాకెన్, మీనాక్షీ నటరాజన్, భజన్‌లాల్ జాతవ్‌లతో ఏర్పాటు చేసిన కమిటీతో కలవడానికి కూడా కొందరు సీనియర్లు నిరాకరించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుఖ్జిందర్ రందావా ఎక్కడో చెప్పినట్టు ‘సీనియర్లు ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకునే పరిస్థితి కూడా లేదు’ అన్నదే నిజమైతే ఇక ‘ఐక్యత’ ఎంత దూరంలో ఉన్నట్టో?
ఆప్ సర్కారుపై వ్యతిరేకత
రెండుసార్లు సీఎంగా ఉన్న కెప్టెన్ అమరేందర్ సింగ్ కాంగ్రెస్‌కు మిగల్లేదు, ఇటు సిద్ధూ క్రియాశీలకంగా లేక తెరవెనక్కి వెళ్లారు. ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూ పార్టీని వీడారు. సీఎంగా దిగిపోయిన చన్నీ, చాన్నాళ్లు స్తబ్ధుగా ఉండి 2024లో ఎంపీ అయి, ఇప్పుడు మళ్లీ క్రియాశీలకంగా ప్రస్తుత పీసీసీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కెప్టెన్ లాగే బీజేపీలో చేరిన సునీల్ జాకడ్ ఆ పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మూడుమార్లు కాంగ్రెస్ ఎంపీగా పనిచేసిన రవ్నీత్‌సింగ్ బీజేపీలోకి వెళ్లి ఎంపీ (రాజ్యసభ) అయి, ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. ఒకవైపు ఇదంతా జరుగుతున్నా... 2024 ఎన్నికల్లో ‘ఇండియా కూటమి’ మిత్రపక్షమైన ఆప్‌తో వేర్పడి పోటీచేసి కూడా, 13 లోక్‌సభ స్థానాలలో
7 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకొంది. ఆ ఎన్నికల్లో 54 శాతం ఓటు వాటా పొందింది. లోక్‌సభ-అసెంబ్లీ ఎన్నికలు ఒకటి కాకపోయినా అదొక ప్రజా నాడిని పట్టిచ్చే సంకేతమే! అప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత మొదలైందన్నది స్పష్టమైన సంకేతం. ఇప్పుడది ఇంకా పెరిగిందని ప్రజాక్షేత్రం నుంచి వస్తున్న సమాచారం. సదరు పరిస్థితిని సానుకూలంగా మలచుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
