వెలుగు ఓపెన్ పేజీ : ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో  ప్రశ్నార్థకంగా మహిళా భద్రత

వెలుగు ఓపెన్ పేజీ : ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో  ప్రశ్నార్థకంగా మహిళా భద్రత

ప్రముఖంగా ఇటీవల ఒక కాలేజీ  విద్యార్థిని  ఫొటోలు  వాట్సాప్ గ్రూపుల్లో  వైరల్ అయ్యాయి.  మొదట అవి సాధారణ సెల్ఫీలు అని అనుకున్నారు. కానీ దగ్గరగా చూస్తే ఆమె ముఖాన్ని వేరే వ్యక్తి శరీరానికి జతచేసి, అభ్యంతరకరమైన వీడియోగా  మార్చినట్లు తెలిసింది.  అది ఏఐ సాయంతో  చేసిన  డీప్‌‌‌‌ఫేక్ అని తేలింది. ఆ వీడియో చూసినవాళ్లలో చాలామంది ‘ఇంత క్లియర్‌‌‌‌గా ఉంటే నిజమే అయి ఉంటుంది’ అని నమ్మారు.  ఆమె అనుమతి ఉందా? ఆమె జీవితం మీద ప్రభావం ఏమిటి?  అని ఎవ్వరూ ఆలోచించలేదు.  ఫలితంగా ఆ వీడియో విస్తృతంగా షేర్ అయ్యింది. ఆ అమ్మాయి మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైంది.  చివరికి  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  నిందితులు పట్టుబడ్డారు.  కానీ అప్పటికే  జరిగిన నష్టం కోలుకోలేనిది. ఈ  సంఘటన స్పష్టంగా  చెప్పేదేంటంటే.. డిజిటల్  ప్రపంచంలో ఒక క్లిక్ కూడా ఎవరి జీవితాన్నైనా  నాశనం చేసే శక్తి కలిగి ఉందని.  డిజిటల్ హింసను తేలికగా తీసుకోవడం సమాజానికి అత్యంత ప్రమాదకరం.

డిజిటల్ హింస

గృహ హింసనే ఇప్పటికీ సీరియస్‌‌‌‌గా తీసుకోని  పురుషాధిక్య సమాజం మనది. ఇక డిజిటల్ వయొలెన్స్ తీవ్రతను  అర్థం  చేసుకుంటుందని ఆశించడం అత్యాశే.  ఇటీవల  వెలువడిన ఒక అధ్యయనం 'ఎక్స్‌‌‌‌పీరియన్సింగ్  టెక్నాలజీ ఫెసిలిటేటెడ్  జెండర్ -బేస్డ్  వయొలెన్స్ ఇన్ ఇండియా' అన్న ఆ నివేదికలో  అధ్యయన  వివరాలతోపాటు బాధితులు, నిపుణుల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి.  వ్యక్తిగత  ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల నుంచి తస్కరించి  వాటితో  డీప్‌‌‌‌ఫేక్‌‌‌‌లు సృష్టించడం, ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగ వేదికలపై, అశ్లీల వెబ్‌‌‌‌సైట్లలో పంచుకోవడం, ఒకరిని లక్ష్యంగా చేసుకుని వేర్వేరు వేదికలపై  వెంటాడి వేధించడం, ఫేక్ ఐడెంటిటీలతో లైంగిక వేధింపులకు పాల్పడటం,  స్త్రీలపట్ల ద్వేషాన్ని,  స్త్రీవాదం పట్ల వ్యతిరేకతనీ ప్రచారం చేయడం (మ్యానోస్ఫియర్, ఇన్సెల్స్)... ఇవన్నీ డిజిటల్ వయొలెన్స్ రూపాలే.   ఐరాస అధ్యయనం ప్రకారం 33 శాతం స్త్రీలు డిజిటల్ హింసను ఎదుర్కొంటున్నారు.  

ఆన్‌‌‌‌లైన్ వేధింపులు

ఆన్‌‌‌‌లైన్ వేధింపులు  వికృత రూపం దాలుస్తున్నాయనడానికి నిదర్శనం  ఈ వేధింపులు బాధితుల  వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఉద్యోగ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపడమే. ఈ వేధింపులు భౌతిక, మానసిక ఆరోగ్యాలను  హరిస్తున్నాయి. కుంగుబాటుకు లోనై  ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్నాయి. సైబర్ బులీయింగ్ బాధితుల్లో ఆత్మహత్యల ఆలోచనలు 11.5 శాతం,  ఆత్మహత్యా యత్నాలు 8.7 శాతం ఎక్కువని ఓ అధ్యయనం చెబుతోంది.  ఒకసారి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోకి ఏదైనా వెళ్తే దాన్ని పూర్తిగా తొలగించడం దాదాపు అసాధ్యం.  సైబర్ బులీయింగ్  ప్రైవసీని హరిస్తూ,  ప్రాణహానిని ప్రేరేపిస్తూ  తీవ్రమైన  మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ప్రస్తుతం ఉన్న ఐటీ రూల్స్ ప్రకారం న్యాయవిరుద్ధమైన కంటెంట్‌‌‌‌ను  ఫిర్యాదు చేసిన 36 గంటల్లోగా  తొలగించాలి.  ఏఐ టూల్స్ దుర్వినియోగం కాకుండా  చూసుకోవాల్సిన బాధ్యత టెక్నాలజీ సంస్థలదే.  అవి స్పందించకపోగా తాత్సారం చేస్తున్నాయని, దాంతో తప్పనిసరిగా చట్టపరంగా వెళ్లాల్సి వస్తోందని నివేదిక చెబుతోంది.  ప్రస్తుతం ఈ కేసులన్నీ ఐటీ యాక్ట్‌‌‌‌లోని సెక్షన్లు 66C, 66D, 66E, 67, 67A, 67B, అలాగే భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల ఆధారంగా నమోదవుతున్నాయి.

వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలి

సాధ్యమైన చోటల్లా ఆ కాంటాక్ట్‌‌‌‌ను తొలగించాలి.  అలాగే 'StopNCII.org' సాయంతో  ఆయా చిత్రాలను,  వీడియోలను ఆన్‌‌‌‌లైన్ నుంచి తొలగించే ప్రయత్నం చేయవచ్చు. తొలగించే ముందే స్క్రీన్‌‌‌‌షాట్లు, లింకులు, టైమ్‌‌‌‌స్టాంప్‌‌‌‌ల రూపంలో  సాక్ష్యాలను  భద్రపరచుకోవాలి. ఆన్‌‌‌‌లైన్,  సోషల్ మీడియా తదితర ఖాతాలన్నింటికీ టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ పెట్టుకోవాలి. దేశవ్యాప్త హెల్ప్‌‌‌‌లైన్ (181),  నేషనల్  సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్,  మిషన్ శక్తి లాంటివి ఈ విషయంలో  బాధితులకు అండగా నిలుస్తున్నాయి. 

 

- హరిప్రసాద్ దూపాటి 
సోషల్ ఎనలిస్ట్