ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోన్న నాగార్జునసాగర్‌లోని బుద్ధవనానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త హంగులు అద్దుతోంది. బుద్ధుడి జీవిత విశేషాలు, బౌద్ధ తత్వాన్ని అత్యాధునిక సాంకేతికతతో సందర్శకుల కళ్లముందు ఆవిష్కరించేలా రూ.25 కోట్ల వ్యయంతో డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను నిర్మిస్తోంది. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, లేజర్ ప్రొజెక్షన్ల వంటి ఆధునిక సాంకేతికతలతో ఈ కేంద్రం రూపొందుతోంది. ఇక్కడికి వెళ్తే బుద్ధుడి కాలంలో అడుగుపెట్టినట్లుగా అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం త్వరలో సరికొత్త రూపును సంతరించుకోనుంది. పర్యాటకులకు వినూత్న అనుభూతిని అందించేందుకు రూ.25 కోట్ల వ్యయంతో అత్యాధునిక ‘డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్’ను నిర్మిస్తున్నారు. బుద్ధుడి జీవితం, బోధనలు, బౌద్ధమత చరిత్రను ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. తెలంగాణను అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశీ దర్శన్ 2.0’ పథకం కింద ఫండ్స్ సాంక్షన్ చేసింది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుద్ధవనంలోని 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు.
బుద్ధుడి కాలంలోకి వెళ్లినట్లుగానే..
డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో 150 అడుగుల వ్యాసార్థం, 25 అడుగుల ఎత్తుతో భారీ డోమ్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో చుట్టూ ఏర్పాటు చేసే డిజిటల్ స్క్రీన్‌ల ద్వారా బుద్ధుడి జీవిత విశేషాలు, ఆయన బోధనలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 120 బౌద్ధ క్షేత్రాలు, వివిధ దేశాల్లో బౌద్ధమత వ్యాప్తికి సంబంధించిన దృశ్యాలను ప్రదర్శించనున్నారు. ఒకేసారి సుమారు 500 మంది సందర్శకులు వీక్షించేలా ఈ కేంద్రాన్ని రూపొందిస్తున్నారు. వర్చువల్ రియాలిటీ(వీఆర్) హెడ్‌సెట్ల సాయంతో బుద్ధుడి కాలంలోకి వెళ్లినట్లుగా అనుభూతి కలిగేలా సాంకేతికతను వినియోగిస్తున్నారు. బుద్ధుడి జననం నుంచి జ్ఞానోదయం వరకు జరిగిన కీలక ఘట్టాలను ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి పర్యాటకులకు కలగనుంది.
ఏఆర్, లేజర్ టెక్నాలజీ..
ఆగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్) సాంకేతికత ద్వారా బుద్ధవనంలోని శిల్పాలను మొబైల్ లేదా ట్యాబ్‌తో పరిశీలిస్తే వాటి చరిత్ర, నేపథ్యం, బౌద్ధ తత్వశాస్త్రం, ఆచార్య నాగార్జునుడి బోధనలు డిజిటల్ రూపంలో కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మహాస్తూపం లోపల, గోడలపై లేజర్ కాంతులతో బుద్ధుడి జాతక కథలను కదిలే చిత్రాల రూపంలో ప్రదర్శించనున్నారు. దీంతో బౌద్ధ చరిత్రను మరింత ఆసక్తికరంగా తెలుసుకునే అవకాశం కలగనుంది.
దక్షిణ కొరియా సాంకేతిక సహకారం..
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో దక్షిణ కొరియాకు చెందిన డిజిటల్ హెరిటేజ్ సెంటర్ సాంకేతిక సహకారం అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధమతం ఎలా విస్తరించింది, వివిధ దేశాల్లోని బౌద్ధ కట్టడాల ప్రత్యేకత ఏమిటి? అనే అంశాలను హై-క్వాలిటీ గ్రాఫిక్స్, వీడియోల ద్వారా ప్రదర్శించనున్నారు.
ప్రత్యేక టూరిజం సర్క్యూట్..
బుద్ధవనంతో పాటు ఫణిగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. జపాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, కొరియా వంటి దేశాల నుంచి వచ్చే బౌద్ధ భక్తులకు, దేశీయ పర్యాటకులకు ఈ కేంద్రం ప్రధాన ఆకర్షణగా మారనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అందుబాటులోకి వస్తే నాగార్జునసాగర్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులు, యువతకు చరిత్రను సాంకేతికతతో మేళవించి పరిచయం చేసే అరుదైన వేదికగా ఇది నిలవనుంది.
