నో -నెట్‌‌వర్క్ జోన్ కు జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు..స్వయంగా తీసుకెళ్లిన సీఎం ఒమర్ అబ్దుల్లా

నో -నెట్‌‌వర్క్ జోన్ కు జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు..స్వయంగా తీసుకెళ్లిన సీఎం ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌‌  సీఎం ఒమర్ అబ్దుల్లా బుధవారం తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను నో-నెట్‌‌వర్క్ జోన్‌కు తీసుకెళ్లారు. జమ్మూ కాశ్మీర్‌‌కు రాష్ట్ర హోదా, రాజకీయ హక్కుల పునరుద్ధరణలో జాప్యంపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో తన భవిష్యత్ వ్యూహాన్ని చర్చించడానికి వారిని రాజధాని శ్రీనగర్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని దాచిగామ్ నేషనల్ పార్క్ అనే నెట్‌‌వర్క్ లేని (నో-సిగ్నల్) ప్రాంతానికి తీసుకెళ్లారు.  గుప్కర్ రోడ్డులోని సీఎం ప్రైవేట్ కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరుకోగానే వారందరినీ అక్కడ సిద్ధంగా ఉన్న బస్సుల్లోకి ఎక్కించారు. ఆ తర్వాత ఆ బృందం తమకు తెలియని ఒక గమ్యస్థానానికి బయలుదేరింది. 

తన ప్రభుత్వం సాగించిన 19 నెలల పనితీరును సమీక్షించడమే ఈ సమావేశం ఉద్దేశమని అబ్దుల్లా చెప్పారు. దీనిని ఆయన ఒక ‘ఆఫ్-సైట్’ సమావేశంగా అభివర్ణించారు. ‘గడిచిన 19 నెలల కాలంలో జరిగిన మంచి, అంతగా బాగోలేని విషయాలు, వాటి మధ్య ఉన్న ప్రతి అంశాన్ని సమీక్షించుకోవడానికి మేము ఒక రోజంతా ఆఫ్-సైట్‌‌కు వెళ్తున్నాం’ అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. సీఎం సోషల్ మీడియా ఫొటోలు ఎంతో సంతోషకరమైన వాతావరణాన్ని చూపిస్తున్నప్పటికీ.. జమ్మూ కాశ్మీర్‌‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణలో జరుగుతున్న ఆలస్యంపై ఒమర్ అబ్దుల్లా పెద్దగా ఏమీ చేయడం లేదనే భావనపై సొంతపార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది.