వేములవాడ/వేములవాడ రూరల్/కోనరావుపేట, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శిలఫలకాలకే పరిమితం కాగా.. కాంగ్రెస్ వచ్చాక వేములవాడ ప్రాంతంలో అభివృద్ధి పనులు స్పీడ్‌గా సాగుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడలో మూడో బ్రిడ్జి స్లాబ్ పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా, టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. అంతకుముందు వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ ఆవునూరి శంకరవ్వ-, వార్డు సభ్యులు ఆవునూరి కార్తీక్, కోడం రవి, గొర్రె నర్సవ్వతో పాటు సుమారు 50 మంది ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అధికారమే లక్ష్యంగా పనిచేయాలి
సుల్తానాబాద్, వెలుగు: రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పని చేయాలని ఎమ్మెల్సీ చిన్నమల్ అంజిరెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లిలో రెండు రోజులపాటు నిర్వహించనున్న జిల్లాస్థాయి పార్టీ ప్రశిక్షణ శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కేంద్రంలో, దేశంలోని అనేక రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉండటానికి నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే కారణమన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి
మల్యాల, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, దీనికోసం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని జగిత్యాల డీఈవో కే. రాము టీచర్లను ఆదేశించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం మల్యాల మండలం రాజారాం గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు డీఈవో హాజరయ్యారు. ఎంఈవో జయసింహారావు, సర్పంచ్ గుర్రం విజయ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, హెచ్ఎం అశోక్, పాల్గొన్నారు
