టెహ్రాన్: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ బుధవారం వెల్లడించింది. అయితే, తమ దేశంలోని లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడులకు కువైట్, బహ్రెయిన్ దేశాలదే బాధ్యత అని స్పష్టం చేసింది. ఇరాన్ మీడియా సంస్థ ‘ఫార్స్’ కథనం ప్రకారం.. హార్మూజ్ జలసంధిలోని ఇరాన్ చమురు ట్యాంకర్, కేష్మ్ ద్వీపంలోని ఒక టెలికమ్యూనికేషన్స్ టవర్ పై కువైట్, బహ్రెయిన్‌లలో ఉన్న సైనిక స్థావరాల నుంచి అమెరికా దళాలు బుధవారం తెల్లవారుజామున దాడులు ప్రారంభించాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఈ దాడులు కాల్పుల విరమణను, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించాయని పేర్కొంది. చమురు ట్యాంకర్, సమాచార వ్యవస్థలపై ‘‘ఉగ్రవాద అమెరికా సైన్యం జరిపిన దూకుడు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం” అని ఒక ప్రకటనలో తెలిపింది.
